
ఉగ్రవాద గ్రూప్‌కు మద్దతుగా కారు నంబర్ ప్లేటు?
లక్నో పోలీసులు ఇప్పుడో మారుతీ ఎర్టిగా కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాని యాజమాని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
లక్నో పోలీసులు ఇప్పుడో మారుతీ ఎర్టిగా కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాని యాజమాని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంక్షిప్తనామమైన ఐఎస్‌ఐఎస్ లాగా కనిపించేవిధంగా ఫ్యాన్సీ నంబర్ ప్లేటును తన వాహనానికి పెట్టుకోవడమే ఇందుకు కారణం. నిబంధనల ప్రకారం నంబర్ ప్లేటుపై అంకెలను ఫ్యాన్సీరీతిలో ముద్రించకూడదు. అంతేకాకుండా ఈ నెంబర్ ప్లేటుపై ఉన్న 5151 అంకెలు ఐఎస్‌ఐఎస్‌లాగా కనిపించేవిధంగా ఉండటంతో ఇది స్థానికంగా అనుమానాలు రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్ మద్దతుగా సదరు కారు యజమాని ఇలా నంబర్‌ప్లేటు రాయించి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లక్నోలోని నిషాంత్‌గంజ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద శుక్రవారం సాయంత్రం ఈ కారు పార్కు చేసి ఉండగా ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేటు చూసి విస్తుపోయారు. నంబర్ ప్లేటులో మొదట ఐఎస్‌ఐఎస్ అని కనిపించగా.. కాస్తా గమనించి చూస్తే ఫ్యాన్సీ నెంబర్ (UP 32 HA 1515) కనిపించింది. ఇందులో ఐదుని ఇంగ్లిష్ అక్షరం ఎస్‌లాగా కనిపించేవిధంగా ముద్రించడంతో ఇది ఐఎస్‌ఐఎస్ అని కనిపిస్తోంది. ఇలా నంబర్ ప్లేటు రాయడం నిబంధనల విరుద్ధమని, అందుకే దీని యజమాని ఎవరు అన్నది ఆరా తీస్తున్నామని లక్నో ట్రాఫిక్ ఏఎస్పీ హబిబుల్ హసన్ తెలిపారు.