వైమానిక దాడుల్లో 250 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి!
వాషింగ్టన్: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్లో జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఫల్లూజ పట్టణంలో జరిపిన వైమనిక దాడుల్లో 250 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 40 వాహనాలను ధ్వంసం అయినట్లు 'రాయిటర్స్' వెల్లడించింది.
ఫల్లూజ ప్రాంతంలోని సామాన్య ప్రజానికాన్ని ముందుగానే వేరే ప్రాంతాలకు తరలించి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది కేవలం ప్రాధమిక అంచనా మాత్రమే అని మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని తెలుస్తుంది.