విచ్చలవిడి విధ్వంసాలకు ‘జునూద్’ కుట్ర
♦ ఆత్మాహుతి దాడులు.. వాహనాల ద్వారా పేలుళ్లకు పథకం
♦ బెంగాల్ నుంచి ఆయుధాలు.. పక్కా వ్యూహం సిద్ధం చేసిన అఫ్రిదీ
♦ ఎన్‌ఐఏ బృందాల దర్యాప్తులో వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ దేశవ్యాప్తంగా విచ్చలవిడి విధ్వంసాలకు కుట్ర పన్నింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడటం.. ఎంపిక చేసుకున్న ప్రముఖులను హతమార్చడంతో పాటు వాహనాల్లో బాంబులు పెట్టి పేల్చడం ద్వారా భారీ విధ్వంసాలకు పథకం రచించింది. బెంగళూరులో పట్టుబడిన ఆలమ్ జబ్ అఫ్రిదీ నేతృత్వంలో అమలు చేసేందుకు సిద్ధమైన ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇన్వెస్టిగేషన్, నిందితుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో పనిచేసిన అఫ్రిదీ.. ప్రస్తుతం సిరియా కేంద్రంగా పనిచేస్తున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ‘జునూద్’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జునూద్ మాడ్యూల్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నలుగురు అరెస్టు అయిన విషయం విదితమే.
తుమ్కూర్‌లో ఫిదాయీన్‌ల కోసం..
కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా వ్యవహారాలు సాగించిన అఫ్రిదీ భారీ విధ్వంసాలతో పాటు సంచలనాలు సృష్టించడం ద్వారా ‘జునూద్’కు ప్రాచుర్యం సంపాదించాలని భావించాడు. షఫీ సూచనల మేరకు ఒకే సమయంలో ఎక్కువచోట్ల మానవబాంబు దాడులు (ఫిదాయీన్ ఎటాక్స్) చేయించాలని నిర్ణయించాడు. ఈ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా రెండుసార్లు ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన అఫ్రిదీ.. అక్కడున్న అల్‌కాయిదా క్యాడర్‌ను కలిశాడు. ఫిదాయీన్‌ల ఎంపిక, శిక్షణ తదితర అంశాలను వారి నుంచి తెలుసుకున్నాడు. కర్ణాటకలోని తుమ్కూర్‌లో ఉన్న ‘జునూద్’ మాడ్యూల్‌కు చెందిన వారినే మానవబాంబులుగా మార్చాలని నిర్ణయించుకుని రెండుసార్లు అక్కడకు వెళ్లి వచ్చాడని ఎన్‌ఐఏ గుర్తించింది. అక్కడ ఎవరెవరిని కలిశాడనే అంశాలపై ఆరా తీస్తోంది.
మిలిటరీ వాహనాలతో పేలుళ్లు..
ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వారిని టార్గెట్ చేసుకున్న ‘జునూద్’ మాడ్యూల్.. ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. మిలిటరీ వాహనాలను తస్కరించి, వాటిలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబుల్ని పెట్టి విధ్వంసం సృష్టించాలని పథకం వేసింది. మహారాష్ట్ర, గోవాల్లో ఈ కుట్రను అమలు చేయాలని భావించింది. మిలిటరీ వాహనాలను, ఆ తరహాలో ఉన్న ఇతర వాహనాలను చోరీ చేయడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న కొందరు వాహనచోరులతోనూ అఫ్రిదీ, మరికొందరు సంప్రదింపులు జరిపారని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. మిలిటరీ వాహనాలపై నిఘా తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో వీటిని ఎంపిక చేసుకున్నారు. ఈ వ్యవహారాలను చక్కబెట్టడానికి గోవాలో రూ. 1.5 లక్షలతో అద్దెకు ఓ ఇంటినీ ఎంపిక చేసుకున్నారని తెలిసింది. గత నెల్లో దేశవ్యాప్తంగా చిక్కిన 14 మందిలో ఉన్న మొహిసిన్ సయీద్, ఖాలిద్ ఈ వ్యవహారాలను పర్యవేక్షించారని తేలింది.
వెపన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్..:
టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్ని కాల్చిచంపడం ద్వారా భయానక వాతావరణం సృష్టించేందుకు ‘జునూద్’ మాడ్యూల్ సిద్ధమైంది. దీని కోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్‌లో ఖరీదు చేయాలని భావించింది. ఈ బాధ్యతల్ని అఫ్రిదీ హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో ఒకడైన నఫీజ్ ఖాన్‌కు అప్పగించాడు. ఆయుధాల సమీకరణ కోసం మాడ్యూల్ చీఫ్‌గా ఉన్న ముంబై వాసి ముదబ్బీర్ నుంచి హవాలా ద్వారా రూ. 2 లక్షల వరకు అందుకున్న నఫీజ్ పలుమార్లు బెంగాల్‌కు వెళ్లివచ్చాడు. బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అక్రమ ఆయుధ వ్యాపారులతో సంప్రదింపులు జరిపాడు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) మాడ్యూల్‌ను సంప్రదించడానికి నఫీజ్ ప్రయత్నాలు చేసినట్లు అధికారులు ఆధారాలను సేకరించారు.