‘ఉగ్ర’ స్వర్గధామాలుగా పాక్, అఫ్ఘాన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరిక
♦ పాక్, అఫ్ఘాన్, మధ్య ప్రాచ్యంలో దశాబ్దాలుగా అస్థిర పరిస్థితులు
♦ ఐఎస్, అల్‌కాయిదాల వేట కొనసాగుతుంది
♦ ఉగ్ర సంస్థ ఐఎస్ ముస్లింలకు ప్రతినిధి కాదు
♦ చివరి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఒబామా
వాషింగ్టన్: సరికొత్త ఉగ్రవాద వ్యవస్థలకు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, మధ్యప్రాచ్య దేశాలు స్వర్గధామాలుగా రూపొందే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. అమెరికా, అమెరికా మిత్రదేశాల రక్షణ కోసం ఇస్లామిక్ స్టేట్, అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థలపై వేటను కొనసాగిస్తానని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఒబామా బుధవారం తన చివరి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేశారు. ‘ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్‌కాయిదాలపై అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా దృష్టి పెట్టాలి. అయితే, అంతటితో ఊరుకోకూడదు.
ఐఎస్ ఉనికి లేని మధ్య ప్రాచ్యం, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, మధ్య అమెరికా,ఆసియా, ఆఫ్రికాల్లోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. కొత్తకొత్త ఉగ్రవాద సంస్థలకు ఈ ప్రాంతాల్లో కొన్ని స్వర్గధామాలుగా మారే పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా దృష్టి పెట్టాలి’ అన్నారు. ‘అల్‌కాయిదా, ఐఎస్‌లు మన ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారారు. ప్రజల ప్రాణాలే కాదు.. తమ ప్రాణాలంటే కూడా లెక్కలేని కొద్దిమంది అపార నష్టం కలిగించగలరు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో తనతో కలసిరావాలని విపక్ష రిపబ్లికన్లకు ఒబామా పిలుపునిచ్చారు. ఈ పోరులో గెలవాలంటే ఐఎస్‌పై మిలటరీ ప్రయోగానికి కాంగ్రెస్ అనుమతినివ్వాలన్నారు.
‘కాంగ్రెస్ అనుమతినిచ్చినా, ఇవ్వకపోయినా.. గతంలో ఇతర ఉగ్రవాద సంస్థలకు చెప్పిన గుణపాఠాన్ని ఐఎస్‌కు కూడా చెప్పి తీరుతాం’ అని తేల్చిచెప్పారు. ‘గుర్తుంచుకోండి.. మీరు అమెరికన్ల వెంట పడితే.. మేం మీ వెంట పడతాం. సమయం పడ్తుంది కానీ.. ఈ విషయంలో మాకు చాలా అనుభవం ఉంది. మేం ఎక్కడికైనా చేరగలం’ అని ఉగ్ర సంస్థలకు విస్పష్ట హెచ్చరిక జారీ చేశారు. ‘ఉగ్రవాదం విషయంలో మేం సీరియస్‌గా ఉన్నామని చూపించుకోనక్కరలేదు.. ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో ఒకదానికి ప్రతినిధి అని పదేపదే చెబుతూ ఈ పోరులోని కీలక మిత్రపక్షాలను దూరం చేసుకోనక్కరలేదు.. వారి అసలు రంగు బయటపెడితే సరిపోతుంది. వారు హంతకులని, మూఢ ఛాందసులని, వారిని నాశనం చేయాల్సిన అవసరం ఉందని చెబితే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ఆగ్రహం
అమెరికా ప్రజల రాజకీయ, ఆర్థికపరమైన భయాందోళనలపై రాజకీయాలు చేస్తున్నారంటూ రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ‘ రాజకీయ నాయకులు ముస్లింలను అవమానించడం, మసీదులను ధ్వంసం చేయడం వల్ల మన భద్రత పెరగదు. అది తప్పు. అలాంటి చర్యల వల్ల ప్రపంచం దృష్టిలో పలుచనవుతాం.’ అన్నారు. ఐక్యతాసందేశంతో అధ్యక్షుడినయ్యానని, పార్టీల మధ్య విభజనపూరిత విద్వేష రాజకీయాలు పెరగడం తనను అత్యంత బాధిస్తున్న విషయమని ఒబామా పేర్కొన్నారు. తన హయాంలో అమెరికా సాధించిన అభ్యున్నతికి గర్విస్తున్నానన్న ఒబామా.. అమెరికాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలమైనదని, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం గురించిన కథనాలు ఊహాగానాలని స్పష్టం చేశారు.