ఐఎస్‌పై అమెరికా యుద్ధం!
♦ ఉధృతంగా దాడులకు రంగం సిద్ధం
♦ నేడు జాతినుద్దేశించి మాట్లాడనున్న ఒబామా
♦ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
♦ ఐఎస్‌పై ఇప్పటికే విరుచుకుపడుతున్న రష్యా, ఫ్రాన్స్, యూకే
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్‌స్టేట్(ఐఎస్)పై అమెరికా పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించబోతోందా? ముష్కర మూకలను ఏరివేసేందుకు మరింత ఉధృతంగా దాడులు చేయబోతోందా? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగం సిద్ధం చేస్తున్నారా? ఇదే విషయాన్ని దేశ ప్రజలకు స్వయంగా వివరించబోతున్నారా? స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు (భారత్‌లో సోమవారం ఉదయం 6.30 గంటలు) తన అధికారిక కార్యాలయం నుంచి జాతినుద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ప్రసంగంలో ఆయన ఏం చెబుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐఎస్‌పై పోరులో రష్యా అమెరికా కన్నా ఒకడుగు ముందుండడం, పారిస్ దాడులతో ఫ్రాన్స్ ముష్కర మూకలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడం, బ్రిటన్ కూడా బరిలోకి దిగిన నేపథ్యంలో ఒబామా ప్రసంగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాలి ఫోర్నియాలోని శాన్ బెర్నార్‌డినోలో ఇటీవల ఓ క్రిస్మస్ పార్టీపై ఐఎస్ ప్రేరిత దంపతులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 14 మందిని బలిగొన్నారు. దీంతో ఆ సంస్థ ఉగ్రవాదులను తుదముట్టించాల్సిందిగా అంతర్గతంగా కూడా ఒబామా సర్కారుపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతినుద్దేశించి అధ్యక్షుడు చాలా అరుదైన సందర్భాల్లో మాట్లాడతారు.
ఐఎస్‌ను తుదముట్టించేందుకు అనుసరించే వ్యూహాలను, దేశ పౌరుల భద్రత కోసం తీసుకోబోయే చర్యలను ఒబామా ప్రసంగంలో వివరించనున్నట్లు సమాచారం. కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో దర్యాప్తు పురోగతిని వివరించనున్నారు. ‘‘అమెరికా ప్రజల భద్రతకు అగ్రప్రాధాన్యం ఇస్తూ తీసుకోబోయే చర్యలను అధ్యక్షుడు వివరిస్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లు, ముష్కరులను ఓడిం చేందుకు అనుసరించబోయే వ్యూహాలను చర్చిస్తారు. ఐఎస్‌ను తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తారు. ఇటీవల కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై తీసుకున్న చర్యలను పేర్కొంటారు’’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ ఎర్నెస్ట్ తెలిపారు. కాలిఫోర్నియాలో ఘటనపై ఒబామా ఇప్పటికే అత్యున్నత సమీక్ష నిర్వహించారు. ఎఫ్‌బీఐ డెరైక్టర్, అటార్నీ జనరల్, అంతర్గత భద్రతా మంత్రి, నిఘా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌కు కూడా ఫోన్ చేసి కాలిఫోర్నియా ఘటనపై చర్చించారు.