ఆ పోలీసులను చంపింది మేమే!
ఆ పోలీసులను చంపింది మేమే!
Published Tue, Oct 25 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో పోలీసు శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడిలో 60 మంది మరణించగా, 120 మంది గాయపడ్డారు. ఆత్మాహుతిదాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు ఇస్లామిక్ స్టేట్ తరచు తన ప్రకటనల కోసం ఉపయోగించే అమాఖ్ వార్తాసంస్థ తెలిపింది. ఐసిస్‌లోని ఖొరసాన్ బృందం మిషన్ గన్లు, గ్రెనేడ్లు ఉపయోగించడంతో పాటు, తర్వాత తమ నడుముకు కట్టుకున్న బాంబులను పేల్చేసినట్లు వివరించింది. ఈ దాడిలో పాల్గొన్నట్లుగా ఐసిస్ చెబుతున్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోను కూడా అమాఖ్ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే, అమాఖ్ ఈ విషయాన్ని చెప్పడానికి ముందు బలూచిస్తాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ చీఫ్ అయిన మేజర్ జనరల్ షేర్ అఫ్ఘాన్ మాత్రం.. లష్కరే ఝంగ్వి అనే నిషేధిత సంస్థకు చెందిన అల్- అలామీ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదులు, వాళ్ల హ్యాండ్లర్ల మధ్య జరిగిన సంభాషణను తాము ఇంటర్‌సెప్ట్ చయగా, అఫ్ఘానిస్థాన్ నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసిందన్నారు.
కాగా, ఇంతకుముందు క్వెట్టా నగరంలోని ఒక ఆస్పత్రి మీద దాడిచేసి 73 మందిని చంపింది కూడా తామేనని అప్పట్లో ఐసిస్ సంస్థ ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది తామంటూ పాకిస్థానీ తాలిబన్లకు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ వర్గం కూడా చెప్పింది. క్వెట్టా నగర శివార్లలో ఉన్న ఈ శిక్షణ శిబిరంపై ముసుగులు ధరించిన ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు ఐదు గంటల పాటు దాడి జరిగింది. లోపలకు చొరబడిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని, తాము అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీశామని దాడినుంచి తప్పించుకున్న కొందరు పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement