
ముంబై నుంచి వెళ్లి సిరియాలో..
ముంబై: ముంబై లోని కళ్యాణి ప్రాంతం నుంచి సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ అఫిషియల్ మీడియా చానల్ ఖిలాఫా న్యూస్‌లో.. అమన్ అమరుడయ్యాడంటూ ఓ కథనాన్ని ఫోటోతో సహా ప్రచురించింది.
అమన్‌తో పాటు విదేశాల నుంచి వచ్చి తమ తరఫున పోరాడుతూ మృతి చెందిన మరికొంత మంది వివరాలను సైతం ఐఎస్ ప్రకటించింది. అమన్ రక్కా ప్రాంతంలో మృతి చెందినట్లు ఖిలాఫా న్యూస్ తెలిపింది. అమన్ మృతి గురించి గత నెలలోనే అతడి కుటుంబసభ్యులు సమాచారం అందుకున్నప్పటికీ.. భారత భద్రతా సంస్థలు దీనిని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ప్రకటనతో అమన్ మృతిపై క్లారిటీ వచ్చినట్లైంది.
2014 లో ఇరాక్‌లోని పవిత్ర ప్రాంతాలను సదర్శించేందుకని కళ్యాణి ప్రాంతం నుంచి అమన్‌తో పాటు మరో ముగ్గురు సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపారు. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన ఓ వీడియోలో అమన్‌తో పాటు అతడి మిత్రుడు.. ఇండియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అమన్‌తో పాటు వెళ్లిన ముగ్గురిలో సహీమ్ టంకీ ఇంతకుముందే మృతి చెందగా.. అరీబ్ మజీద్ గత ఏడాది ఇండియాకు తిరిగివచ్చి విచారణనను ఎదుర్కొంటున్నాడు. మరో వ్యక్తి షేక్ ప్రస్తుతం సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్నట్లు సమాచారం.