Naveen Case: Hari Hara Krishna And Niharika Reddy Confession Statement : - Sakshi
Sakshi News home page

నవీన్‌ కేసు: దొరికే ఛాన్స్‌ లేదని చెప్పాడు, హరిని నమ్మాను.. పోలీసులతో నిహారిక!

Published Thu, Mar 9 2023 11:29 AM | Last Updated on Fri, Mar 10 2023 9:55 AM

Naveen Case: Niharika Confessed Crime - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్యకు.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పగా,  హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని.. నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. 

నవీన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీస్‌ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక పోలీసుల ఎదుట నవీన్‌ నేరాన్ని అంగీకరిస్తూ.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. 

కస్టడీ విచారణలో హరిహర కృష్ణ చెప్పింది ఇదే..  నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్‌షుక్‌ నగర్ లోని ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా. నవీన్ నాకు సెకండ్ ఇయర్ లో పరిచయం. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులం. వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పటికీ.. ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం. గతంలో నవీన్‌, నిహారిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాళ్లు. అయితే.. నవీన్‌ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి నిహారిక గొడవ పడింది. అతనితో మాట్లాడడం మానేసింది. నీహారిక అంటే నాకు కూడా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. వాళ్లిద్దరూ విడిపోయారని తెలిశాక.. కొన్ని నెలల కిందట ఆమెకు ప్రపోజ్‌ చేశా. ఆమె సరే అంది. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అయితే.. 

నవీన్‌ అప్పుడప్పుడు నిహారికకు కాల్‌ చేసి, మెసేజ్‌లు చేసేవాడు. అది నిహారికకు నచ్చేది కాదు. ఆ విషయం నాతో చెప్పుకుని బాధపడింది.  నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే కోపంతో నవీన్‌ను చంపాలని మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నా. రెండు నెలల కిందట ఓ షాపింగ్‌ మార్ట్‌లో కత్తి కొన్నాను. అలాగే వేలి ముద్రలు పడకూడదని ప్లాస్టిక్‌ గ్లౌజ్‌లు కొన్నా. వాటిని ఇంట్లో సజ్జపైన ఎవరికీ కనిపించకుండా ఓ బ్యాగులో దాచా. జనవరి 16వ తేదీన.. ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడం కుదురలేదు.

మళ్లీ.. ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ నాకు కాల్ చేసి , హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా మరోస్నేహితుడు ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకు వెళ్లాం. ఈలోపు నవీన్‌ ఎల్‌బీ నగర్‌లో ఉన్నా అని కాల్‌ చేశాడు. నా బైక్‌పై నేను, నా ఫ్రెండ్‌ వెళ్లి.. నవీన్‌ను పికప్‌ చేసుకున్నాం. నాగోల్‌లో భోజనం చేశాక.. నా ఫ్రెండ్‌ వెళ్ళిపోయాడు. నేను , నవీన్ మలక్ పేటలోని మా ఇంటికి వెళ్ళాం. ఆరోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళ్తా అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పా. హత్యకు ఇదే ఛాన్స్‌ అనుకుని.. సజ్జపై దాచిన బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లా. 

ఆరోజు నా ఫోన్ నుండి నవీన్.. నీహారికకు కాల్ చేసి ఆరు నుంచి ఏడు నిముషాలు మాట్లాడాడు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్‌ఆర్‌ దాటగానే.. ఈ టైం లో అంత దూరం వద్దు అనుకున్నాం. ఇద్దరం కలిసి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి మాట్లాడాలని నవీన్‌తో చెప్పాను. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమించుకుంటున్నామని, ఆమెను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగా. నవీన్‌ కోపంతో నన్ను కొట్టాడు. నవీన్‌ చంపాలనే కసి మీద ఉన్న నేను.. ఆ కోపంతోనే నవీన్‌ను తోసేసి గొంతు నులిమి చంపేశా. శ్వాస ఆగిపోయిందని గుర్తించి.. కత్తితో శరీర భాగాలను వేరు చేశా. శరీర భాగాలను వేరు చేసే టైంలోనూ నాలో ఆవేశం చల్లారలేదు. 

ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో  పడేసాను. నవీన్‌ సెల్‌ఫోన్‌ను రోడ్డుపై పడేశా. శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. ఆ బ్యాగును రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసాను. అక్కడి నుంచి  బ్రాహ్మణపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకుని.. హసన్‌కు అసలు విషయం చెప్పా. హసన్‌ భయపడ్డాడు. నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఉదయం వెళ్లి లొంగిపోతా అని చెప్పా. రక్తంతో తడిసిన నా బట్టలను ఒక బ్యాగ్‌లో వేసి.. సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశా. ఉదయం 10 గంటలకు నిహారిక కు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నా. అప్పుడు నవీన్‌ను చంపేశానని నిహారికతో మొత్తం జరిగింది చెప్పా. ఆమె భయపడింది.. తిట్టింది. ఆ తర్వాత బైక్‌ ఇంట్లో పెట్టి.. వరంగల్‌కు వెళ్లా. మా నాన్నకి విషయం చెప్పడంతో..  లొంగిపోవాలని సూచించాడు. తిరిగి 24వ తేదీ హాసన్ ఇంటికి వెళ్లా. ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడతను. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని .. హత్య చేసిన స్పాట్ కి వెళ్లా.  అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశా.  ఆ తర్వాతే అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ముందు లొంగిపోయా. 

నవీన్‌ దూరం అయ్యాకే.. హరి దగ్గరయ్యాడు!
ఇక మరో ఇద్దరు నిందితులు హసన్‌, నిహారికలు సైతం నేరాన్ని అంగీకరించారు. నేరం గురించి తెలిసి కూడా భయంతో ఎవరికీ చెప్పలేదన్నారు. ఇక నవీన్‌ హత్య తర్వాత.. తనను హరి నాలుగుసార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది. నవీన్‌ తాను ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే తమ బ్రేకప్‌ అయ్యాక హరి తనకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెప్పిందామె.

నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్.. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహరకృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్‌ నాతో మాట్లాడానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా.  నవీన్‌ కోపంతో రగిలిపోయేవాడు. కానీ, నేను అది సరదానేమో అనుకున్నా ఒక్కోసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. నేను తిడితే.. అదీ జోక్‌ అనేవాడు. ఒకరోజు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి.. ఒక బ్యాగులో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‌ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్‌తో మాట్లాడడం మానేశానని, ఇక అతను నన్ను మరిచిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా. 

హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఇంటర్‌ ఫ్రెండ్స్‌ కలుస్తున్నట్లు హరి నాకు చెప్పాడు. నవీన్‌ గనుక ఈసారి కాల్‌ చేస్తే.. వేరే వాళ్లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆరోజు హరి ఫోన్‌ నుంచే నవీన్‌ ఫోన్‌ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్‌ చేశాడు. నవీన్‌ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడు. నేను సరే అన్నాడు. ఆ ఉదయం హరి నన్ను కలవాలని మేసేజ్‌ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీదకు వచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్‌ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్‌ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే.. మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్‌ అయ్యా. 

ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా .. హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో కలిసాడు. నవీన్‌ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్‌ ఫ్రెండ్స్‌ నాకు ఫోన్‌ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియది చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత హసన్‌ ఫోన్‌ చేసి హరి మిస్సయినాడని,  వాళ్ళ అక్కాబావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా హసన్‌ మరో ఎవరికీ ఫోన్‌ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి.. నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్‌, హరికి సూచించాడట. ఆ పని చేశాక.. బైక్‌ సర్వీసింగ్‌కు ఇచ్చాడు. నాకు ఫోన్‌ చేసి.. మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో హరి స్నానం చేసినాడు. మా బావ అడ్వకేట్. ఆయనతో మాట్లాడాలని.. హరి చెప్పగా, అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డిని పిలిచి నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 

పోలీసులకు, నవీన్‌ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. హరిహరకృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement