![Gold Smuggling Mafia At Hyderabad Police Take Complaint From Victims - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/25/crime1.jpg.webp?itok=FgIR4zxF)
సనత్‌నగర్: బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా నలుగురిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో సనత్‌నగర్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి వెళ్లిపోవడంతో వారిని తీసుకువచ్చి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదును స్వీకరించామని ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. ఈ ఘటనతో నగరంలో గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీడొక్కడే సినిమాను తలదన్నే రీతిలో...
సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాను తలదన్నేలా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కొనసాగింది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. పర్యాటక వీసాపై దుబాయ్‌కు వెళ్లేవారికి డబ్బులు ఎరగా వేసి అక్రమంగా బంగారాన్ని నగరానికి తరలిస్తున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారానికి పలు రకాల రసాయనాలను అద్ది కాళ్లకు చుట్టుకుని ఎయిర్‌పోర్ట్ అధికారులను సైతం బురిడీ కొట్టించారు.
పాతబస్తీకి చెందిన షహబాజ్ (21), శ్రీనగర్‌కాలనీకి చెందిన అయాజ్ (22), సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన పహద్ (23)లను 15 రోజుల క్రితం స్మగ్లర్లు దుబాయికు పంపారు. నాలుగు రోజులపాటు దుబాయ్‌లో గడిపిన వీరికి అక్కడి స్మగ్లర్లు ఒక్కొక్కరికీ రెండు కిలోల చొప్పున పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని ఇచ్చి పంపారు. ఈ బంగారాన్ని నగరంలో ఉన్న స్మగ్లర్ల ముఠాకు అందజేసినందుకుగాను దుబాయికు వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, అక్కడ వసతి ఏర్పాట్లు, వీసా ఖర్చులతో పాటు మరో రూ.10 వేలను అందజేశారు. దుబాయికు వెళ్లిన ముగ్గురిలో అయాజ్, షహబాజ్‌లు తిరిగి నగరానికి వచ్చేశారు. పహాద్ మాత్రం కనిపించకుండాపోవడంతో అతని ఆచూకీ తెలపాలంటూ ఆయాజ్, షహబాజ్‌లతో పాటు కనిపించకుండాపోయిన పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, అతని బంధువు
ఆసిమ్‌లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. బాధితులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేసు నమోదుకు బాధితులు విముఖత వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా కేసు ఏమాత్రం ముందుకుసాగలేదు. దీంతో సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ నేరుగా బాధితులను పిలిపించి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి స్మగ్లింగ్ ముఠాపై కేసు నమోదు చేశారు. స్మగ్లింగ్ ముఠాలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
(చదవండి: విల్లాలో విందు.. పేదింట విషాదం)
Comments
Please login to add a commentAdd a comment