సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల కారణంగా కాపురాలు కూలిపోయిన ఉదంతాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. దీనికి పరస్పర విరుద్ధమైన ఘటన ఇది. అప్పటికే విడిగా ఉంటున్న నగరానికి చెందిన దంపతులను.. పంజాబ్‌కు చెందిన ఓ సైబర్ క్రిమినల్ చర్యలు ఒకటి చేశాయి. బాధితురాలిగా మారిన భార్యకు చేయూతనిచ్చిన భర్త ఆమెతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది..
2003లో వివాహం చేసుకున్న ఓ జంట లక్డీకాపూల్ ప్రాంతంలో నివసించేది. ఈ దంపతులకు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో వీరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని వేరుగా ఉంటున్నారు. గృహిణి అయిన సదరు మహిళ వద్దే కుమారుడు ఉంటున్నాడు. వీరికి ప్రతి నెలా భర్త అందించే రూ.30 వేల భరణమే జీవనాధారంగా మారింది.
ఇటీవల కాలంలో ఆమె ఫేస్‌బుక్‌లో యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ఈమెకు పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వ్యక్తితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న నేపథ్యంలో తన వివరాలను అతడికి చెప్పింది. తాను లుథియానాలో ప్రభుత్వ ఉద్యోగినని, వ్యాపారం కూడా చేస్తున్నానన్నాడు. తనకు ప్రతి నెలా కనిష్టంగా రూ. 2 లక్షల ఆదాయం ఉంటుందంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటానంటూ ప్రతిపాదించాడు. దీనికి ఆమె కూడా అంగీకరించడంతో ఒకటి రెండుసార్లు నగరానికి వచ్చి కలిసి వెళ్లాడు.
ఆ సందర్భంలో ఫొటోలు తీసుకున్నాడు. హఠాత్తుగా ఓ రోజు ఫోన్ చేసిన అతగాడు అర్జంట్‌గా కొంత మొత్తం కావాలని తీసుకున్నాడు. ఇలా రెండు సందర్భాల్లో రూ.70 వేలు చెల్లించిన ఆమెకు అనుమానం వచ్చింది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి ఆమె స్వయంగా లుథియానా వెళ్లారు. సదరు వ్యక్తి తండ్రిని కలిసి విషయం చెప్పగా.. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి అయిన తన జీతంతోనే కుటుంబం నడుస్తోందని, తన కుమారుడు ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతుంటాడని జవాబు వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు తిరిగి వచ్చింది.
అప్పటి నుంచి లుథియానా వ్యక్తితో తెగదెంపులు చేసుకుంది. దీంతో కక్షగట్టిన అతగాడు ఫేస్‌బుక్‌లో నకిలీ ఐడీలు సృష్టించాడు. వివాహితతో దిగిన ఫొటోలను ఆమెకు, భర్తకు, కుమారుడితో పాటు వారి స్నేహితులకూ పంపి దుష్ఫ్రచారం చేయడం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను కలిసి ఏం జరిగిందో ఆరా తీసి బాధితురాలిగా మారినట్లు గుర్తించాడు. భార్యతో దూరంగా ఉన్న కాలంలో అతడికీ కొన్ని చేదు అనుభవాలు ఎదురు కావడంతో ఇకపై ఆమెతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. లుథియానా వ్యక్తిని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న వీళ్లు జంటగా వచ్చి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment