'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'
మహిళలపై అత్యాచారాల విషయంలో కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని ఆయన అన్నారు. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పుడు జార్జి ఇలా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగిసిన తర్వాత తన పీజీ హోంకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా వాళ్లు వచ్చి ఆమెను వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి, అత్యాచారం చేశారు.
అయితే ఇంతటి దారుణమైన ఘటన విషయంలో రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరుపట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా వ్యాఖ్యలుచేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడేముందు ఏం చెబుతున్నామో ఓసారి ఆలోచించుకోవాలన్నారు.
కాగా ఇంతకుముందు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా అత్యాచారాల విషయంలో ఇలాగే వ్యాఖ్యానాలు చేశారు. ముందు అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేస్తారని, తర్వాత వాళ్లిద్దరూ గొడవ పడినప్పుడు అత్యాచారం కేసులు పెడతారని అన్నారు. అబ్బాయిలు తప్పులు చేయడం మామూలేనని, అయితే రేప్ చేసినంత మాత్రాన ఉరి తీస్తారా అని అడిగారు. నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారని వ్యాఖ్యానించారు.