రేటింగ్‌ల కోసం రేప్‌లకు ప్రచారం!
కర్ణాటక హోంమంత్రి జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు
బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ ధ్వజం
బెంగళూరు: టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగ్‌ల కోసం అత్యాచారాల ఘటనలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్ వ్యాఖ్యానించటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోంమంత్రి మీడియాపై నెపం వేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులు సక్రమంగా నిర్వర్తించటం చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని జార్జ్‌కు సూచించింది. ‘మీడియాపై నిందలేసి ఆయన తప్పించుకోవాలని భావిస్తున్నారు. అసలు రేప్ ఘటనలు వెలుగులోకి రావటానికి చాలావరకు మీడియా కృషే కారణం’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం బెంగళూరులో చెప్పారు.
హోంమంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమని య డ్యూరప్ప తెలిపారు. అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని ధ్వజమెత్తారు. మీడియాపై బురద చల్లటం సరికాదని మాజీ సీఎం, బీజేపీ నేత జగదీష్ షెట్టర్ సూచించారు. హోంమంత్రి వ్యాఖ్యల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ఎలాంటి సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారో వివరణ కనుక్కుంటానని చెప్పారు. బెంగళూరు పాఠశాలల్లో ఇటీవల చిన్నారులపై తరచూ లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జార్జ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఇలాంటి వార్తలే కావాలి. టీఆర్పీ పెంచుకునేందుకే వీటిని చూపుతున్నారు. మంచి వార్తలు చూపితే బాగుంటుంది’ అని జార్జ్ మీడియాను ఉద్దేశించి బుధవారం పేర్కొన్నారు.