చైతన్యమే మందు
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై సాగుతున్న అత్యాచారాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజల్లో విృ్తతంగా చైతన్యాన్ని కలిగించడమే సరైన మందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ. 65 కోట్ల విలువ చేసే వస్తువులను సొంతదారులకు అందజేసేందుకు మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చట్టాల్లోని కొన్ని లొసుగులు, చైతన్యం కొరవడడం, అత్యాచార ఘటనలను ఎక్కువ చేసి చూపించడం తదితర కారణాలతో లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోందన్నారు. అభం.. శుభం ఎరగని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడేవారు వృుగాలకన్నా హీనమని పేర్కొన్నారు. జనసంఖ్య పెరుగుతున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, నేరాలను అడ్డుకునేందుకు గాను పోలీసులు శక్తికి మించి శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. ఇక హొయసల వాహనాల ద్వారా గస్తీని పెంచి నేరస్తుల్లో భయాన్ని రేకెత్తించాలని సూచించారు.
నేరాలు జరిగిన సమయంలో వాటికి ప్రత్యక్ష సాక్షులైన వారు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, తద్వారా చాలా మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు. నేరాలు జరిగిన సమయంలో అక్కడి సాక్షాధారాలను పోలీసులు అత్యంత జాగ్రత్తగా సేకరించడం ద్వారా అసలైన దోషులకు శిక్ష పడేలా చేయవచ్చని పేర్కొన్నారు. అత్యాచారాలను నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలతో పాటు ప్రజల్లో సైతం చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా అత్యాచారానికి పాల్పడితే ఎంత శిక్ష పడుతుంది తదితర అంశాలపై ప్రజలు అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. ఇక తమకు సంబంధించిన వస్తువులను సైతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతపై ప్రజలపై ఉందన్నారు. ఎక్కువ మొత్తంలో అభరణాలు ధరించడం, లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో నగలు ధరించడం వల్ల కూడా దొంగతనాల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. ఇక ఇంత పెద్ద మొత్తంలో వస్తువులను రికవరీ చేసిన పోలీసు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
సమాజం నుంచి బహిష్కరించాలి....
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని సమాజం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ పేర్కొన్నారు. పోలీసులు రికవరీ చేసిన వస్తువులను సొంత దారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయనఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆయా పాఠశాలలతో పాటు సమాజానికే కళంకాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు. అత్యాచార ఘటనల్లోని నిందితులను విచారించేందుకు, ఆయా కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులకు పూర్తి స్వాతంత్య్రం కల్పించినట్లు వెల్లడించారు.