సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నాళ్లో వేచిన ఉదయం వెలుగుచూసింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానుల అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను పరిశీలించిన గవర్నర్ తన ఆమోద ముద్ర వేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సమాన అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి ఓర్వలేని శక్తులు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెరవలేదు.
ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధాని కావడాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఎన్ని దుష్ప్రచారాలకు దిగినా.. చివరికి ఇది తుపానుల నగరంగా ముద్ర వేయాలని యత్నించినా.. సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. ఈ రాష్ట్రానికి భవిష్యత్ కీర్తి రేఖ విశాఖేనని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి ఆ దిశగానే అడుగులు వేసి.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు రాజబాట వేశారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా గవర్నర్ రాజముద్ర వేసిన నేపథ్యంలో జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం, పార్టీశ్రేణులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సంబరాలు చేసుకున్నాయి.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. ఎందుకంటే.. విశాఖ అందాల నగరి.. సుందర సువిశాల తీరం.. ఇక్కడ అలల సవ్వడే తప్ప.. అలజడులకు తావు లేదు. ప్రశాంతతకు చిరునామా.. విపత్కర పరిస్థితులు తలెత్తవనే నమ్మకం.. నివాస యోగ్యమైన నగరం. ఇన్ని సానుకూలతలతో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్.. అందర్నీ ఆకర్షిస్తోందంటూ ఆర్థిక సర్వేలో సైతం వెల్లడైంది.
ఇంతకీ ఇంతలా ఆకర్షిస్తున్న విశాఖలో ఏముంది? సువిశాల సాగర తీరం ఉన్నా.. వందేళ్లలో ఒకే ఒక్క తుపాను మాత్రమే ఇక్కడ తీరం దాటడానికి గల అనుకూల వాతావరణ పరిస్థితులకు కారణాలేంటి..? అన్ని వర్గాల వారినీ ఈ నగరంలో ఇంతలా ఏం ఆకర్షిస్తోంది.. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు పేరుంది. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందని అందరి అభిప్రాయం. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న “రియల్’రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. అన్ని సర్వేలూ నివాసానికి, వ్యాపారానికి అనువైన నగరాల్లో విశాఖపట్నం ఉందని స్పష్టం చేస్తున్నాయి.
నాటి బెస్త గ్రామమే.. నేటి మెగా సిటీ
1933.. అక్కడక్కడా విసిరేసినట్లుండే ఇళ్లు.. మిణుకుమిణుకుమనే దీపాలు.. చిన్నపాటి జ్వరం వచ్చినా.. ప్రాణాలు నిలుస్తాయో లేదో అనే దుస్థితి. మొత్తం కలిపి పట్టుమని 60 వేల జనాభా కూడా లేని వైజాగ్‌పట్నం. కాలం గిర్రున తిరిగింది. ఆకాశ హరŠామ్యల్లాంటి భవంతులు.. అద్దాల మేడలు.. విద్యుద్దీపాల ధగధగలు.. సువిశాల రహదారులు.. ప్రాణాలు నిలబెట్టే అత్యాధునిక ఆస్పత్రులు.. సిటీ అంటే ఇదీ అనిపించేలా ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. సువిశాల సాగరతీరం.. అడుగడుగునా పర్యాటక సోయగంతో నగరం మెట్రో సిటీలను తలదన్నేలా రూపుదిద్దుకుంది.
ఇంతింతై.. జనాభా ఇంతై..
1872లో కేవలం 6 చదరపు మైళ్లలో విస్తరించిన విశాఖ నగర జనాభా కేవలం 32,500 మాత్రమే. 1955లో విస్తీర్ణం 12 చ.మైళ్లకు చేరుకోగా జనాభా నాలుగు రెట్లు పెరుగుతూ 1.20లక్షలకు చేరుకుంది. క్రమక్రమంగా పారిశ్రామికీకరణతో పాటు అందాల నగరంగా పేరొందుతూ.. విశాఖపై అందరికీ ఇష్టం పెంచేలా మారిపోయింది. దీంతో ప్రస్తుతం మహా విశాఖ నగరం 625 చ.కిమీగా విస్తరించింది. 20.30 లక్షల జనాభాని తన గూటికి అక్కున చేర్చుకుంది.
అందాల నగరిలో.. హాయిగా..
విశాఖ నగరం సామాన్యుడికీ స్వాగతం పలుకుతుంది.. బిలీనియర్‌కి రెడ్ కార్పెట్ వేస్తుంది. నెలకు రూ. 3 వేలు వేతనంతో జీవించే సగటు జీవి దర్జాగా బతకగల సౌకర్యాలున్నాయి. నెలకు రూ.3 లక్షలు వేతనం తీసుకునే ఉద్యోగి విలాసంగా జీవించే ఆధునికతా విశాఖ సొంతం. భారతదేశం ఎలాగైతే.. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు. మతాలు, భాషలతో భాసిల్లుతోందో.. విశాఖ మహా నగరం కూడా.. అదే తీరుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకుంది. ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలే కాదు.. కశ్మీర్ నుంచి నుంచి తమిళనాడు వరకు.. రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు.. ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసిస్తూ సిటీకి సలాం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో 10 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్సే ఉన్నారంటే... విశాఖ ఎలా విశాల నగరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనం.. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ద్వితీయ శ్రేణి నగరాల్లో మేటి..
మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్‌గా భావించేవారు ఒకప్పుడు. కాల క్రమేణా.. మెట్రో నగరాలు ఓ విధంగా సామాన్యుడు భయపడే స్థాయికి దిగజారుతున్నాయి.. ఎందుకంటే పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్న వయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్–2, టైర్–3 సిటీస్ వైపే మొగ్గుచూపుతున్నారు. వీటిలో విశాఖ నగరం ది బెస్ట్ సిటీగా ఆహ్లాదకరమైన వాతావరణమే కాకుండా... సరికొత్త జీవన సరళికీ కేంద్రంగా నిలిచింది. ద్వితీయ శ్రేణి నగరమే అయినా మహానగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకుంది.
వాతావరణ పరంగా విశాఖ బెస్ట్
వాతావరణ పరంగా చూసినా.. విశాఖ ది బెస్ట్ సిటీ. ఇక్కడ అంతా మోడరేట్ వాతావరణం. ఎండాకాలంలో విపరీతమైన ఎండ ఉండదు. వేసవిలోనూ విశాఖలో అత్యధిక ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 మధ్యలోనే ఉంటాయి. 42 దాటడమనేది అతి స్వల్పం. గత వందేళ్ల వాతావరణ పరిస్థితుల్ని తీసుకుంటే.. మచిలీపట్నం, కాకినాడ మొదలైన తీరాలపై ఎఫెక్ట్ అయినన్ని తుపాన్లు.. విశాఖపై ప్రభావం చూపలేదు. విశాఖలో తుపాన్లు తీరం దాటడం అనేది బహుస్వల్పం. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా తుపాన్లు ఒడిశా వైపు గానీ.. కాకినాడ, మచిలీపట్నం వైపుగానీ తరలిపోతాయి. 2014 హుద్‌హుద్ మినహా ఏ తుపానూ విశాఖ తీరాన్ని తాకలేదు. ఈశాన్య పవనాల ప్రభావం కూడా అమరావతి, విజయవాడ ప్రాంతాలతో పోలిస్తే.. విశాఖపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
10 నెలలు.. వరస పరిణామాలు
♦రాజధానిపై సలహాలు సూచనల కోసం 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
♦మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ 2019 డిసెంబర్ 20న తన నివేదికను సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది.
♦కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కోసం 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
♦ఈ క్రమంలోనే జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తమ నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.
♦ఈ ఏడాది 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. అనంతరం ఆ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
♦ఇందులో భాగంగానే జనవరి 22న బిల్లును శాసన మండలి ముందుకు తీసుకురాగా ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది,
♦న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండో సారి వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
♦తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.
హర్షం వ్యక్తం చేస్తున్నా..
శ్రావణ శుక్రవారం రోజున రాష్ట్ర ప్రజలకు మరో పండగ మూడు రాజధానుల బిల్లు ఆమోదం. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నా.. విశాఖ పరిపాలన రాజధాని కావడంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది.
–బి.సత్యవతి, ఎంపీ, అనకాపల్లి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అభినందనీయం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతు ఇస్తున్నాం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.
– వీసం రామకృష్ణ, నక్కపల్లి
గవర్నర్‌కు కృతజ్ఞతలు
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం అభినందనీయం. తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు ఈ బిల్లును అడ్డుకునేందుకు చాలా కుట్రలు చేశారు. రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఈ బిల్లులను ఆమోదించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు. రైతుల నుంచి కారు చౌకగా కొట్టేసిన భూములు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు దీక్షలు చేయిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటయితే ఉత్తరాంధ్ర పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. కర్నూల్‌లో న్యాయరాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమకు సీఎం జగన్ న్యాయం చేశారు.
– గొల్ల బాబూరావు, అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే, పాయకరావుపేట
చాలా సంతోషంగా ఉంది..
నా జన్మదినోత్సవం రోజున ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ.. నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. మూడు రాజధానుల వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలకు ఆస్కారం ఉండదు. ఈ బిల్లును అడ్డుకోడానికి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పం ముందు అవి ఫలించలేదు. గవర్నర్ ఆమోద ముద్రతో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనడంతో ఎటువంటి సందేహం లేదు.
– కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం
జగన్ చరిత్రలో నిలిచిపోతారు
అధికార వికేంద్రీకరణ జరగాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమైంది. సీఎం నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఇక తిరుగులేని అభివృద్ధి బాట పడుతుంది. నాయకుడు జనం నుంచి వస్తే... ఎలాంటి పరిపాలన ఇస్తారో సీఎం వైఎస్ జగన్‌ను చూస్తే అర్థమవుతుంది. నాడు పాదయాత్రలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. పరిశీలించడంతో ప్రతి ప్రాంతంపైనా ఆయనకు అవగాహన ఏర్పడింది. అందువలనే ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
– దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు
బిల్లుల ఆమోదం.. శుభపరిణామం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం శుభపరిణామం. అసెంబ్లీలో రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ.. శాసనమండలిలో ప్రతిపక్షం కుట్రపూరితంగా అడ్డుకుంది. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఈ రెండు కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి తగిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా..
– చెట్టి పాల్గుణ, ఎమ్మెల్యే, అరకు
విపత్తుల ప్రభావం అంతంత మాత్రమే..
భౌగోళికపరంగా విశాఖపట్నం అత్యంత అనుకూలమైన నగరం. సముద్రతీరంలోని రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాలతో పోలిస్తే.. ఈ ప్రాంతానికి తుపాన్లు తాకే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. చలికాలంలో విపరీతమైన చలి ఉండదు. వానాకాలంలోనూ ముంచెత్తే వానలుండవు. కావల్సినంత వర్షాలు మాత్రమే పడతాయి. చలికాలంలో అందరూ స్వెట్టర్లు వేసుకునేంతగా చలి వణికించదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా విశాఖపై తక్కువగానే ఉంటుంది. విజయవాడ, గుంటూరు, ప్రకాశం మొదలైన ప్రాంతాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం 40 నుంచి 42 శాతం వరకూ ఉండగా.. విశాఖపై కేవలం 10 నుంచి 12 శాతం మాత్రమే ఉంటుంది. అన్నింటికీ అనుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి విశాఖ అందరికీ నివాసయోగ్యం
– ప్రొఫెసర్ భానుకుమార్, ఏయూ వాతావరణ మాజీ విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment