సేవలకు సెలవు
Published Fri, Aug 9 2013 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
సాక్షి, తిరుపతి: సీమాంధ్ర బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 64 శాఖల్లో 115 సేవలు నిలిచిపోయాయి. ఉద్య మం ఆరంభమైన జూలై 31వ తేదీ నుంచి వివిధ శాఖలకు చెందిన సేవలు స్తంభించిపోయాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. మొత్తం 46 వేల మందికి పైగా ఉద్యోగులు ఉద్యమంలో పా ల్గొంటున్నారు. సుమారు 15వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జిల్లాలో 42 లక్షల మందికి పైగా జనాభా ఉంది. వీరికి నిత్యం సేవలు అందించేందుకు వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తెలంగాణ విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి తొమ్మిది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో
పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలో ప్రజాసేవలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఇన్నాళ్లు పంచాయతీలకు ఎన్నికలు లేకపోవటంతో పాలన పడకేసింది. ఎన్నికలు జరిగాయని సంబరపడుతుండగా చివరి దశ పోలింగ్ రోజే విభజన ప్రకటన వచ్చింది. దీంతో సర్పంచ్‌లు ఎన్నికైనప్పటికీ పాలన ముందుకు సాగించలేని పరిస్థితి. దీంతో పల్లె జనం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
గ్రీవెన్‌స సెల్‌కు అందని ఫిర్యాదులు
సమైక్య ఉద్యమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు 72 గంటలపాటు పెన్‌డౌన్ ముగియగానే గురువారం నుంచి రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరి స్థితి. మొత్తం 29 సేవలు ఉంటే తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం మినహాయించారు. ఉద్యోగులెవ్వరూ విధుల్లో లేకపోవటంతో ప్రతిరోజూ స్థానిక సమస్యలపై వచ్చే ఫిర్యాదులు రావటం లేదు. ఒక్క తిరుపతిలోనే రోజుకు 100కుపైగా ఫిర్యాదులు వస్తుం టాయి. అలా జిల్లా వ్యాప్తంగా చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో మొత్తంగా 500కుపైగా ఫిర్యాదులు అందుతుంటాయి. ప్రస్తుతం ఫిర్యాదులు తీసుకునే వారే లేకపోవడం గమనార్హం. ప్రతి సోమవారమూ నిర్వహించే ‘కాల్‌యువర్ కమిషనర్’ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దీంతోపాటు ప్రతి సోమవారమూ కలెక్టరేట్, ప్రతి మండలంలో రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్‌స డే కార్యక్రమాలు నిలిచిపోయాయి. ‘మీ సేవ’ ద్వారా అందించే 16 సేవలు నిలిచిపోయాయి.
సదస్సులు వాయిదా
తెలంగాణ ప్రకటన చేయకపోతే ఆగస్టు మొదటి వారంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమయ్యేది. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వాయిదా పడినట్లేనని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలా జిల్లాలో సమైక్య ఉద్యమాలతో పాలన స్తంభించడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. అయినా ఉద్యమం మాత్రం ఆపేది లేదని ప్రజలు స్పష్టం చేస్తుండడం గమనార్హం.
Advertisement