విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిషేధం | Raging ban on educational institutions | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిషేధం

Published Wed, Sep 27 2017 2:14 AM | Last Updated on Wed, Sep 27 2017 2:14 AM

Raging ban on educational institutions

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటిలో రాగ్యింగ్‌ నిషేధిస్తున్నామని కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ జి.వి.జి.అశోక్‌కుమార్‌ తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కి పాల్పడిన వారిపైనే కాకుండా ఇకపై యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఆర్డీఓలు, విద్యాసంస్థల ప్రినిపాళ్లు, యూనివర్సిటీల రిజిస్ట్రార్, రెక్టార్లతో సమావేశం నిర్వహించారు. గజల్‌ శ్రీనివాస్‌ ఆలపించిన ‘ఆటకాదురా ఆటవికమురా... వద్దురా ర్యాగింగ్‌’ అనే వీడియోని సమావేశంలో ప్రదర్శించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాసంస్థలలో విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే చర్యలు చోటు చేసుకోకుండా యాజమాన్యాలు నిఘా ఉంచాలన్నారు. ర్యాగింగ్‌ చేసిన విద్యార్థులపై మాత్రమే ఇప్పటి వరకు చర్యలు ఉండేవన్నారు. ఇకపై విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. 

ర్యాగింగ్‌ నిరోధానికి జిల్లా యంత్రాగం చేసే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2014లో వైద్య కళాశాలలో నమోదైన క్రిమినల్‌ కేసు మినహా ఇప్పటి వరకు ఎలాంటి ర్యాగింగ్‌ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగే వరకు కళాశాలల్లో సీసీ కెమెరాల ద్వారా, కమిటీల  ద్వారా విద్యార్థులపై నిఘా ఉంచాలన్నారు.  ఎస్‌కేయూ రిజిస్ట్రార్‌ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు పెడదారిన పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. విద్యాసంస్థల్లో సందేశాత్మక, స్ఫూర్తిదాయక గేయాలను, మహనీయుల సత్సంగాలు, ప్రబోధాలు ఇప్పించాలన్నారు. డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మాట్లాడుతూ కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్పీ వైస్‌ చైర్మన్‌గా, ఆర్‌డీఓలు, ఎస్‌డీపీఓలు, కళాశాల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ర్యాగింగ్‌ నిరోధక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు ద్వారా మాజీ సీబీఐ డైరెక్టర్‌ ఆర్‌.కె.రాఘవన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ జరకుండా నిర్దేశించిన మార్గదర్శకాలను యాజమాన్యాలు పాటించాలన్నారు.

యాంటీ ర్యాగింగ్‌పై ఎస్‌కేయూనివర్సిటీ రూపొందించిన ‘ర్యాగింగ్‌ చేస్తే ఇక జైలుకే’ పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓలు మలోలా, రామారావు, బాలానాయక్, డీఎస్‌పీ మల్లికార్జున వర్మ, సదానందరెడ్డి, జేఎన్‌టీయూ రెక్టార్‌ సుబ్బారావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు పి.రాజారాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement