
కరోనా వైరస్‌పై అన్నివైపుల నుంచి దాడికి ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఇతర పరిశోధనల సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం దన్నుతో ఇంకో ఏడాదిలోగా కరోనా వంటి వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేయనున్నాయి. వివరాలివీ...
టీకా, మందు లేని కరోనా.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. వేల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కరోనా వైరస్ కుటుంబంలో మనకు ఇప్పటివరకు తెలిసింది ఏడు మాత్రమే. మిగిలిన 32లో ఏ ఒక్కటి తోక జాడించినా.. మన మనుగడ కష్టమే. ఈ నేపథ్యంలో ఈ రకమైన వైరస్‌లకు విరుగుడు కనిపెట్టేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బోర్డు.. దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలకు ప్రాజెక్టులు అప్పగించింది. బాంబే, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలతోపాటు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లు వేర్వేరు మార్గాల్లో వైరస్ బెడద తొలగించుకునే మార్గాలను ఆవిష్కరించేందుకు సిద్దమయ్యాయి.
బయో మార్కర్లతో ఆటకట్టు..
కరోనా బారినపడ్డ వారిలో వైరస్‌కు సంబంధించిన బయో మార్కర్లను గుర్తించేందుకు ఐఐటీ బాంబేకి చెందిన సంజీవ్ శ్రీ వాస్తవ ఓ ప్రాజెక్టు చేపట్టారు. జీవక్రియల్లో భాగంగా ఏర్పడే బయో మార్కర్లను గుర్తిస్తే వాటి ఆధారంగా వైరస్‌ను నిర్వీర్యం చేయగల చికిత్సల రూపకల్పన వీలవుతుంది.
పదార్థాల తయారీ..
ప్రస్తుతం మనం వైరస్‌ల నుంచి రక్షణ కోసం శాని టైజర్లు, కొన్ని డిసిన్ఫెక్టెంట్లు ఉపయోగిస్తున్నాం. అలాగే వైరస్‌లు తమపై ఉండేందుకు అవకాశం కల్పించని పదార్థాల తయారీ కోసం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నగ్మా ప్రవీణ్ పరిశోధనలు చేపడుతున్నారు. సర్జికల్ మాస్కులు మొదలుకొని అనేక ఇతర వైద్య పరికరాల్లో, వైద్యశాలల్లో ఈ పదార్థాన్ని పూత పూయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ చ్చు. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లోని జయంత హల్దర్ కూడా తాకిన వెంటనే వైరస్‌లను మట్టుబెట్టగల సూక్ష్మ అణువులను, అణు సమ్మేళనాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
శానిటైజర్లకు ప్రత్యామ్నాయం..
శానిటైజరుకు ప్రత్యామ్నాయంగా పరిసరాల్లోని వైరస్‌లను ఆకర్షించి చంపే వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్త బీఎస్ బుటోలా ఓ ప్రాజెక్టు చేపట్టారు. తడి గుడ్డతో ఇల్లు తుడిచినట్లే బుటోలా బృందం అభివృద్ధి చేసే పదార్థంతో ఉపరితలాలపై ఉండే వైరస్‌ను ఆకర్షించి మరీ మట్టుబెట్టవచ్చన్న మాట.
యాంటీబాడీలు..
కరోనా సోకిన వ్యక్తుల రక్తంలో ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు తయారవుతాయి. ఇలాంటి యాంటీబాడీల తయారీకి ఐఐటీ బాంబే శాస్త్రవేత్త కిరణ్ కొండబాగిల్ పరిశోధనలు చేస్తున్నారు. కరోనా ఉపరితలంపై ఉండే గ్లైకోప్రొటీన్ పనిపట్టేందుకు ఈ యాంటీబాడీలు దోహదపడతాయి. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment