ఆరు నెలల్లో అభివృద్ధి దిశగా!
2015 చివరికల్లా రియల్టీ బూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన దిశగా అడుగులు.. శాంతిభద్ర తలకు పెద్ద పీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరానికి పెరుగుతున్న ఆదరణ.. క్యూ కడుతున్న ఐటీ, ఇతర సంస్థలు.. మెరుగుకానున్న ఉపాధి అవకాశాలు.. నిర్మాణ రంగం వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి హైదరాబాద్ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ‘లెట్స్ గెట్ రియల్’ సదస్సులో పాల్గొన్న వక్తలు. ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) ఇండియా చాప్టర్, సాక్షి మీడియా గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘హైదరాబాద్ రియల్టీ ప్రస్తుత పరిస్థితి- భవిష్యత్తు ప్రణాళికలు’ అనే అంశంపై ట్రెడా అధ్యక్షుడు పి.దశరథ్ రెడ్డి, అప్రెడా అధ్యక్షుడు జి.హరిబాబు, పీబీఈఎల్-ఇన్‌కోర్ కో-ఫౌండర్ జి.ఆనంద్‌రెడ్డి, నమన్ గ్రూప్‌నకు చెందిన నీతా పటేల్, లగ్జరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ ప్రతినిధి సోనాల్ సేత్‌లు బృంద చర్చ చేశారు. ముఖ్యాంశాలివీ...
►కొన్నేళ్లుగా మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో తీవ్ర ఇబ్బంది పడ్డ నిర్మాణ రంగం గాడిలో పడటానికి బోలెడన్ని కారణాలున్నాయి. నిర్మాణ సంస్థలు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాయి. నిధుల కొరత తీవ్రం కావడంతో పలు సంస్థలు ప్రాజె క్టుల్ని కుదించుకున్నాయి. నగదు కొరతను అధిగమించడానికి తమ వద్ద కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్థలాల్ని విక్రయించాయి. పలు నిర్మాణ సంస్థలు నష్టాలు లేకుండా చూసుకోవడానికి ఇతర సంస్థలతో కలసి ఉమ్మడి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి.
►కొన్ని సంస్థలు నిధుల కొరతను అధిగమించడానికి ఆకర్షణీయమైన పథకాల్ని ప్రకటించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో పాత ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాయి. పలు సంస్థలు కొత్త నిర్మాణాల జోలికెళ్లకుండా ప్రస్తుత వాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించాయి.
►ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఫ్లాట్ల రేట్లు తక్కువ. కొన్నాళ్లుగా చాలా మంది సొంతూళ్ల్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించినా నగరానికి గల ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఫ్లాట్లను కొంటున్నారని అప్రెడా అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. ‘‘ప్రాజెక్ట్ నిర్మాణ దశను బట్టి పెట్టుబడులొస్తుంటాయి. అంతే తప్ప ఒక్కసారిగా రావు. ఈస్ట్, నార్త్ దిశల్లోనూ స్థిరాస్తి అమ్మకాలు జోరందుకున్నాయి. భవిష్యత్తు వృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతాలు, పని కేంద్రాలకు చేరువగా ఉన్న ఏరియాల్లో కొత్తగా ఆరంభమైన ప్రాజె క్టుల్లో ధర తక్కువగా ఉంటే కొనుగోలుదారులు ఫ్లాట్లను కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఇంటి ధర పెరుగుతుందనే ఉద్దేశంతో పెట్టుబడిదారులూ ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు లభించే ప్రాజెక్టులు భవిష్యత్తులో వస్తాయో లేవోననే సందేహాలు కొనుగోలుదారుల్లో నెలకొన్నాయి. ఇలాంటి వారు ఆలస్యం చేయకుండా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.
►కొత్తగా మొదలైన ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాది అమ్మకాలు పెరిగాయి. ప్రవాసులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు, ఐటీ నిపుణుల వంటివారు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల్ని కొనేవారి జాబితాలో ముందుంటున్నారని నమన్ గ్రూప్ నీతా పటేల్ చెప్పారు. దేశంలో ఏటా 10-15 శాతం ఎన్నారై పెట్టుబడులు పెరుగుతున్నాయని... బ్రాండ్, మార్కెటింగ్ మీద ఆధారపడి వారు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ఆటా, నాటా వంటి సంస్థలు, బ్యాంకులు ఎగ్జిబిషన్లు నిర్వహించడం కలిసొచ్చే అంశాలంటూ... ఎన్నారై ఎంక్వయిరీలకు రెస్పాండ్ కావాలని, వారితో ప్రొఫెషనల్‌గా డీల్ చేయాలని సూచించారు.
►బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరగడం, ఇళ్ల ధరలు అధికం కావడం వల్ల కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన కొండాపూర్, చందానగర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారని పీబీఈఎల్-ఇన్‌కోర్ కో-ఫౌండర్ జీ ఆనంద్‌రెడ్డి చెప్పారు. ‘‘సరైన ప్రాంతంలో సరైన నిర్మాణాలు ఉంటే కొనుగోలుదారులు వెనుకంజ వేయటం లేదు. అయితే ఏ నగరంలోనైనా స్థిరాస్తి రంగం వృద్ధి చెందాలంటే స్థానిక రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు బయటి నుంచి... ప్రాజెక్ట్ లొకేషన్, ధర, వసతులు అంతర్గతంగా మద్దతిచ్చేలా ఉండాలి. మరోవంక ఆరంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను విక్రయించని ప్రాజెక్ట్‌గా సర్వేల్లో చెబుతున్నారు. ఇది తప్పు. ఎందుకంటే స్థిరాస్తి ప్రాజెక్ట్ అనేది ఒక్క రోజులో నిర్మించేది కాదు. ప్రాజె క్ట్ నిర్మించాలి.. ప్రభుత్వం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు కూడా విక్రయం కాకపోతే అది అన్‌సోల్డ్ ప్రాజెక్ట్ కింద లెక్క. 2000లో నగరంలో ఏటా 5 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యేవి. 2006 తర్వాత ఏటా 25 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యే స్థాయికి నగరం చేరింది. ప్రతి ప్రాజెక్ట్‌లో 3 శాతం పెట్టుబడులను అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని వివరించారు.
►ఏటా 5 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతోందని, 2020 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 70 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని లగ్జరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సోనాల్ సేత్ చెప్పారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. ‘‘ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో బూమ్ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో గిరాకీ కంటే సరఫరా పెరిగింది. అయితే రూ.50 కోట్ల ప్రాజెక్ట్‌ను విక్రయించాలంటే పేపర్, రేడియో వంటి సంప్రదాయ అడ్వర్టయిజింగ్తో అయ్యే పని కాదు. ఇందుకోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మీడియా చాలా అవసరం. ప్రాజెక్ట్‌లోని ప్రతి దశను కొనుగోలుదారులకు గ్రాఫులతో వివరంగా చెప్పాలి. అప్పుడే వారిలో నమ్మకం పెరుగుతుంది’’ అని వివరించారు.
ప్రచారంతోనే రియల్టీ పరుగులు
►అడ్వర్టయిజింగ్ అనేది ట్రెండ్‌ను ఫాలో అవ్వటం కాదు.. సృష్టించాలి. బ్రాండ్, మార్కెటింగ్ అనేది ఏ సంస్థకైనా ముఖ్యమే. ప్రకటనలతోనే స్థిరాస్తి అమ్మకాలు పరుగులు పెడతాయి. బ్రాండింగ్, మార్కెటింగ్‌తో అది మరింత జోరందుకుంటుంది.
►స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే కస్టమర్లు ముందుగా చూసేది లొకేషనే. అంటే ఆఫీసుకు దగ్గర్లోనో.. పిల్లల స్కూలుకు దగ్గర్లోనో.. లేక బంధువులు, సంబంధీకుల దగ్గర్లోనో ఉండాలని. ఆ త ర్వాతే ధర చూస్తారు. హైదరాబాద్‌లో ఎక్కువ శాతం 2 బీహెచ్‌కే ఫ్లాట్ల వైపే మొగ్గుచూపుతారు. వాటి రేటు కూడా రూ.35 లక్షల్లోపే ఉండాలి. ఆ గీత దాటితే కొనడం కష్టమే. ఫ్లాట్ విస్తీర్ణం కూడా కొంత మేర ప్రభావం చూపిస్తుంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్లంటే గరిష్టంగా 1,800 చ.అ. ఉండాల్సిందే. చాలా వరకు సంస్థలు ఇంత విస్తీర్ణంలో ఫ్లాట్లను ఇవ్వలేకే కుదేలవుతున్నారు.
►ఈ ఏడాది నుంచి స్థిరాస్తి రంగంలోనూ అడ్వర్టయిజింగ్ ప్రభావం అనే అంశంపై సదస్సులు నిర్వహిస్తున్నాం. రిటైల్, రియల్ ఎస్టేట్ ఈ రెండు రంగాలకు అడ్వర్టయిజింగ్ చాలా ముఖ్యం.
►ఐఏఏ ఇండియా చాప్టర్ ఈ ఏడాదితో 25 వసంతాల్లోకి అడుగుపెట్టింది. గతేడాది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్‌లో 32 కార్యక్రమాలను పూర్తి చేశాం. ఈసారి వాటి సంఖ్యను 50కి పెంచుతాం.
►దేశంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో సదస్సులు, సమావేశాలూ నిర్వహించాం.
►రాష్ట్ర జీడీపీలో 35 శాతం వాటా స్థిరాస్తి సంస్థలు చెల్లించే పన్నులు, వ్యాట్ ఇతరత్రానే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇనుము, సిమెంట్, ఇసుక, రంగులు వంటి సుమారు 250కిపైగా పరిశ్రమలు ఒక్క స్థిరాస్తి రంగంపైనే అధారపడి పనిచేస్తున్నాయి.
- ఎస్కే స్వామి, ఐఏఏ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్
ప్రచారానికి మాంద్యమే సరైన సమయం
►మాంద్యం సమయంలో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ క త్తిమీద సామే. అయితే ఇలాంటి సమయమే ఎన్నో పాఠాలు నేర్పుతుంది. నిజం చెప్పాలంటే మాంద్యం సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. దీన్ని అందిపుచ్చుకుని సరికొత్తగా, క్రియేటివ్‌గా ప్రచారం చేస్తే విజయవంతమవుతాం.
►మాంద్యం సమయంలో ప్రచారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఉత్పత్తి తాలూకు ప్రయోజనాలు, ఉపయోగాలను సూటిగా... సుత్తి లేకుండా కొనుగోలుదారులకు చేరవేయాలి. అలాంటి మాధ్యమాలనే ఎంచుకోవాలి.
►కస్టమర్ల సందేహాలు, సమస్యలకు నేరుగా స్పందించాలి. ఈమెయిళ్లు, సామాజిక మాధ్యమాల్లో నేరుగా స్పందించాలి. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రచారం చేయాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయిపై ప్రతిఫలం పొందేలా ప్రచార సాధనాలను ఎంచుకోవాలి.
►పేపర్, రేడియో వంటి సంప్రదాయ ప్రచార సాధనాలు తెరమరుగవుతున్నాయని.. ఇక డిజిటల్ ప్రచారమే ఊపందుకుంటుందని అనడం సరైందికాదు. ఎందుకంటే నేటికీ 80 శాతం కొనుగోళ్లు సంప్రదాయ ప్రచార సాధనాల ఆధారంగానే వస్తున్నాయి. ట్రేడ్‌షో, రోడ్‌షోలు, పార్టీల వంటివి నిర్వహిస్తుండాలి. ఆగ్యుమేటెడ్ రియల్టీతో ప్రాజెక్ట్ దశలను కస్టమర్లకు వివరించాలి. వెబ్సైట్లు గజిబిజిగా కాకుండా సులువుగా వినియోగించేలా ఉండాలి.
- జాకబ్, సోమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్
ప్రచారం రాత్రి సమయాల్లోనూ..
►పోటీ అనేది ఒకే రంగానికి చెందింది కాదు. రియల్టీ సంస్థలకు సిమెంట్, స్టీల్, పెయింట్స్ వంటి సంస్థలతో పోటీ ఉండాలి. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే.
►ఆన్లైన్లో స్థిరాస్తి అమ్మకాలు పెరుగుతున్నాయి. 2015 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 37 శాతం అడ్వర్టయిజింగ్ ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే జరిగింది.
►మంచి ప్రాజెక్ట్‌ను నిర్మించినంత మాత్రాన కస్టమర్లు రారు. దానికి తగిన ప్రచారం ఉంటేనే కొనుగోలుకు ముందుకొస్తారు. అది కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రచారం చేయాలి.
►ఓ పుస్తక సంస్థ ఇటీవల ఏం చేసిందంటే.. ఒక్క ట్వీట్ చేసి పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చంటూ సరికొత్త విధానానికి తెరలేపింది. ఇలా ప్రచారంలో కొత్త ధోరణిని తీసుకురావాలి. అప్పుడే కస్టమర్లను చేరుకుంటాం. నో బ్రోకర్.కామ్ సంస్థ స్థిరాస్తి రంగంలో మధ్యవర్తుల అవసరమే లేకుండా చేసేందుకు సరికొత్త పద్ధతులను తీసుకొచ్చింది. ఆన్లైన్లో అగ్రిమెంట్లు, ఆగ్యుమేటెడ్ రియల్టీతో ప్రాజెక్ట్ పరిశీలన వంటివి దీనికి ఉదాహరణ.
►చాలా వరకు స్థిరాస్తి సంస్థలు కస్టమర్లకు ప్రాపర్టీ విజిట్లను డే టైమ్‌లో చూపిస్తాయి. ఎందుకు నైట్ టైంలో చూపించవనేది నా ప్రశ్న. పొద్దంతా ఆఫీసు పని, గజిబిజి ట్రాఫిక్ సమస్యలతో అలసి ఇంటికొచ్చిన వారికి సాయంత్రం సమయంలో తమ ప్రాజెక్ట్ ఎంతటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపుతుందో నేరుగా చూపిస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రాజెక్ట్‌లోని గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఎంతటి ఆహ్లాదాన్ని నింపుతాయో అర్థమయ్యేలా చేయాలి.
- చారులత రవికుమార్, రాజోర్ఫిష్ ఇండియా సీఈఓ
ప్రచారం నుంచే లగ్జరీ మొదలు..
లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు నిర్మించడంతోనే సరిపోదు. వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకోగలగాలి. కొనుగోలుదారులకు లగ్జరీ స్థిరాస్తులనే విషయం ప్రచారం నుంచే మొదలు కావాలి. ఇందుకోసం వినూత్న పద్ధతులను ఫాలో కావాలి. హీరానంద్, లోధా వంటి కంపెనీలు తరగతులను బట్టి బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తాయి. సామాన్యులకో బ్రాండ్, మధ్యతరగతికో బ్రాండ్, లగ్జరీకో బ్రాండ్లతో ప్రాజెక్ట్‌లను చేస్తాయి. ఈ తరహా విధానాలను అవలంభిస్తే బాగుంటుంది.
►చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అడ్వర్టయిజింగ్ చేయకూడదు. దాదాపు దశాబ్ధం ముందు ఆలోచించి ప్రచారాన్ని ఎంచుకోవాలి. ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేటి ట్రెండ్. ఆన్లైన్ కొనుగోలుదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేసుకునే అవకాశముంటుంది.
►{పాజెక్ట్ పురోగతిని ఫొటోల రూపంలో, ఆగ్యుమేటెడ్ రియల్టీతో కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. అప్పుడే నిర్మాణ సంస్థలపై కస్టమర్లకు నమ్మకం పెరుగుతుంది.
- ప్రీతి వ్యాస్, వ్యాస్ గైనట్టి క్రియేటివ్ ప్రై.లి. చైర్పర్సన్
ప్రచారంలో కొత్త పద్ధతులు తెలిశాయి
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు అభినందనీయం. ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు నగరంలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల ప్రచారం అంటే అదొక మూస ధోరణిలా ఉండేది. కానీ, ఈ సదస్సుతో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు తెలిశాయి. ఉదాహరణకు చారుతల రవికుమార్ ఇచ్చిన ప్రసంగంలో రాత్రి సమయాల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల విజిటింగ్లనేది కొత్తగా ఉంది. దీన్ని మా ప్రాజెక్ట్‌లో అమలు చేస్తాం.
- వెంకట్ రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్
స్థానిక సంస్థలను కలుపుకోవాల్సింది
సరికొత్త ప్రచారం ఎత్తుగడలు ఈ సదస్సుతో తెలిసింది. కానీ,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సదస్సును స్థానికంగా ఉన్న స్థిరాస్తి సంస్థలను కూడా భాగస్వాముల్ని చేసి ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుంది. విలువైన సమాచారం ఉన్న ఈ సదస్సు మిగతా ప్రాంతాల్లోనూ నిర్వహిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది.
- రాము, రామ్ డెవలపర్స్