డబ్బుల కోసం వ్యాపారి అపహరణ..
నిందితుల నుంచి ఇన్నోవా..
డమ్మీ పిస్తోలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
శంషాబాద్: డబ్బుల కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఓ ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామం అల్కాపూరి టౌన్‌షిప్‌లో నివాసముండే రమేష్‌చంద్ అగర్వాల్ (61) నగరంలోని బషీర్‌బాగ్‌లో బాలాజీ గ్రాండ్ బజార్ సూపర్‌మార్కెట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణానికి సమీపంలోనే రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలో నివాసముండే వాజిద్ అలీ (32) కారు మెకానిక్ షెడ్డును నడిపిస్తున్నాడు. చెడు వ్యసనాల కారణంగా వ్యాపారంలో నష్టాలతో ఇబ్బంది పడుతున్న వాజిద్ అలీ కన్ను రమేష్‌చంద్ వ్యాపారంపై పడింది.
ఆయనను కిడ్నాప్ చేసి ఆర్థిక ఇబ్బందులను పరిస్థితులను చక్కబెట్టుకోవాలని పథకం వేశాడు. దీనికి అతడికి పరిచయస్తులైన మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సాజిద్ అలీ(32)తో పాటు హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన షేక్ మోయిన్, షేక్‌మోయిజ్, అర్బాజ్‌లతో కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. ఈక్రమంలో ఈనెల 14న రమేష్‌చంద్ తన షాపు మూసేసి బంధువు అయిన ప్రమోద్ అగర్వాల్‌తో కలిసి రాత్రి 10 గంటల సమయంలో కారులో ఇంటికి బయలుదేరాడు. గమనించిన ముఠాసభ్యులు ఇన్నోవా వాహనంలో వారిని అనుసరిస్తూ వచ్చారు. నెక్నాంపూర్ శివారులోకి రాగానే కారు నడిపిస్తున్న ప్రమోద్‌ను కత్తితో గాయపర్చి రమేష్‌చంద్ అగర్వాల్‌ను ఇన్నోవా కారులోకి బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చే శారు. రమేష్‌చంద్ నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ. 20 వేల నగదును దోచుకొని బషీర్‌బాగ్‌లో వదిలేశారు. కిడ్నాప్ చేసిన క్రమంలో అతడి నుంచి ఆయన కుమారుడు అతీష్ ఫోన్ నంబరు తీసుకున్నారు. అతీష్‌కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు రూ. రెండు కోట్లు ఇవ్వకపోతే త్వరలోనే మీ కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరించడం ప్రారంభించారు.
అతీష్ ఈ విషయమై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పక్కా వ్యూహంతో డబ్బు లు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు అతీష్‌తో ముఠా సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం ఆరాంఘర్‌కు వచ్చిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ నిందితుడు ఆర్బాజ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఓ బొమ్మ పిస్తోలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.