ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌సింగ్
న్యూఢిల్లీ: సంచలన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో తమకు విధించిన ఉరిశిక్షపై పునఃసమీక్ష కోరుతూ ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దోషుల పిటిషన్లను తోసిపుచ్చింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో అత్యాచారం జరిపి, ఆమెను మాటల్లో చెప్పలేని తీవ్ర శారీరక హింసకు గురిచేసి రోడ్డుపైకి విసిరేసి వెళ్లిపోయారు.
అనతరం ఆమె చికిత్స పొందుతూ డిసెంబరు 29న సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోయింది. నిర్భయ అత్యాచార ఘటనగా పేర్కొనే ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. మహిళలకు రక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆంక్షలను ధిక్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావడం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు 2012 డిసెంబరులోనే అరెస్టు చేశారు. వారిలో ఒకరు నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ కావడం, అతను 2013 ఆగస్టులో దోషిగా తేలడంతో మొదట మూడేళ్ల శిక్ష విధించి బాలల కారాగారానికి తరలించారు.
అయితే 2015 డిసెంబరులోనే విడుదలయ్యాడు. మిగిలిన ఐదుగురిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ జరుపుతుండగా 2013 మార్చిలో రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చి 2013 సెప్టెంబరులో మరణ శిక్ష విధించింది. అనంతరం వారికి ఉరిశిక్షను 2014లోనే ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత దోషులు ఉరిశిక్షను సుప్రీంకోర్టులోనూ సవాల్ చేయడంతో 2017 మే నెలలోనే సుప్రీంకోర్టు కూడా వారికి ఉరిశిక్ష సరైందేనని తీర్పు చెప్పింది.
గతంలోనే నిశితంగా విన్నాం..
నిర్భయ అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను గతంలోనే సుప్రీంకోర్టు కూడా సమర్థించినప్పటికీ, మరణశిక్షపై మరోసారి సమీక్షించాలంటూ ముకేశ్, పవన్, వినయ్‌లు మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. గతంలో విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారనీ, ఇప్పుడు మళ్లీ నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదనీ ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్ సింగ్ మాత్రం శిక్షపై పునఃసమీక్ష కోరలేదు.
మరణ వాంగ్మూలాలపై...
నిర్భయ ఇచ్చిన మరణ వాంగ్మూలాలు ఒకదానితో ఒకటి సరిపోలడం లేదనే వాదనను దోషుల తరఫు న్యాయవాది లేవనెత్తగా ధర్మాసనం తోసిపుచ్చింది. దోషులు మళ్లీ మళ్లీ ఇదే అంశాన్ని లేవనెత్తడం సరికాదని మంద లించింది. నిర్భయ డిసెంబరు 16, 21, 25 తేదీల్లో మూడుసార్లు వాంగ్మూలాలిచ్చింది.
మరణశిక్షను రద్దు చేయలేం..
బ్రిటన్, పలు లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా తదితర చోట్ల మరణశిక్షను రద్దు చేశారు కాబట్టి భారత్‌లోనూ అలాగే చేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శిక్షా స్మృతిలో మరణశిక్ష ఉన్నన్ని రోజులూ, ఆ శిక్ష విధింపదగ్గ కేసుల్లో కోర్టులు మరణ శిక్షనే విధిస్తాయనీ, ఇందుకు కోర్టులను ఎవరూ నిందించజాలరని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలు, పౌరుల, నేరస్తుల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించిన మీదట, మరణ శిక్ష విధించడం రాజ్యాంగబద్ధమేనంది.
నమ్మకం తిరిగొచ్చింది: నిర్భయ తల్లి
‘ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడేవారికి ఓ హెచ్చరిక. న్యాయవ్యవస్థపై మా నమ్మకం తిరిగొచ్చింది. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని నేను కోరుతున్నా’ అని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. దోషులకు శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, ఈలోపు దేశంలో తన కూతురిలాగే మరెంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాత ఏం చేయొచ్చు?
దోషులకు మరణశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడంతో ప్రస్తుతం ఉరి శిక్షను తప్పించుకోడానికి మరో రెండు మార్గాలున్నాయి. వాటిలో ఒకటి.. మరణ శిక్షను నిలిపేయాల్సిందిగా కోరుతూ దోషులు మళ్లీ సుప్రీంకోర్టులోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం. రెండోది క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతిని వేడుకోవడం. ఈ రెండు అవకాశాల్లో కూడా దోషులకు ఊరట లభించని పక్షంలో వారికి ఉరి శిక్ష తప్పదు. కేసులో దోషులకు శిక్షను తగ్గించేందుకు సాయపడేవైనప్పటికీ గతంలో ఎప్పుడూ కోర్టు దృష్టికి తీసుకురాని అంశాలేవైనా ఉంటే, ఆ అంశాలపై విచారణ కోసం దాఖలు చేసేది క్యూరేటివ్ పిటిషన్. అలాంటి అంశాలేవైనా ఉన్నా యని ముందుగా జడ్జీలు భావిస్తేనే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారు. లేదంటే పిటిషన్ వేసిన వారికి జరిమానా వేస్తారు.
ఉరితో నేరాలు తగ్గవు: ఆమ్నెస్టీ
ఉరి శిక్షలు విధించినంత మాత్రాన మహిళలపై నేరాలు తగ్గవని మానవ హక్కుల పోరాట సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పేర్కొంది. ‘ఉరిశిక్ష వల్ల మహిళలపై నేరాలు కానీ, మరే ఇతర నేరాలు కానీ తగ్గినట్లు రుజువులేవీ లేవు. చట్టాలు సరిగ్గా అమలయ్యేందుకు, వీలైనన్ని ఎక్కువ కేసుల్లో దోషులకు సరైన శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూ ర్చేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. రేప్‌ల చట్టాల సంస్కరణలపై ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ కూడా ఉరిశిక్షను వ్యతిరేకించింది’ అని ఆమ్నెస్టీ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ అస్మిత అన్నారు.
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదు. గత విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారు. ఆ తీర్పులో ఏ తప్పూ లేదు.
– సుప్రీంకోర్టు ధర్మాసనం
ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడే వారికి ఇది ఓ హెచ్చరిక. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా.
– నిర్భయ తల్లి ఆశాదేవి
సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment