
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. తమకు విధించిన ఉరి శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చాలంటూ నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింద కోర్టులు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులు చేసింది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన ఉరి శిక్షలను గతేడాది మేలోనే సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం నేడు(సోమవారం) ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. 2012 డిసెంబర్ 16న ఈ కిరాతకమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
నిర్భయ కేసు... 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. కానీ ఈ తీర్పును రివ్యూ చేయాలంటూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం వీరి రివ్యూ పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.
మా పోరాటం ఇంతటితో ఆగలేదు. ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోంది. ఇది సమాజంలోని కూతుర్లపై ప్రభావం చూపుతుంది. న్యాయ విధానాన్ని కఠినతరం చేయాలని అభ్యర్థిస్తున్నా. ఎంత వీలైతే అంత త్వరగా నిర్భయ కేసు దోషులను ఉరి తీయాలని కోరుతున్నా. ఇది సమాజంలోని ఇతర అమ్మాయిలకు, మహిళలకు ఎంతో సాయపడుతుంది. - నిర్భయ తల్లి
Comments
Please login to add a commentAdd a comment