
క్షమాభిక్ష పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : మరణ శిక్షలు పడినవారికి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజాతీర్పు ఊరట కలిగించింది. మరణ దండనకు గురైన 15 మంది శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌పై విపరీత జాప్యం వల్ల.. ఆ వ్యక్తికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడానికి అర్హమైనదిగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థనం స్పష్టం చేసింది.
క్షమాభిక్ష పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదులుగా మారిన వారిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మరణశిక్షలకు గురైన నలుగురు ఖైదీలు ఉన్నారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు నలుగురు ఉన్నారు. మానసిక వైకల్యంతో లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఉండేవారికి మరణ శిక్ష విధించరాదని, వారికి జీవిత ఖైదును మాత్రమే విధించాలని స్పష్టం చేసింది.
గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన 14రోజుల్లోనే జాప్యం లేకుండా ఆ ఖైదీకి మరణ శిక్ష అమలు చేయాలని వివరించింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ గురైన అంశాన్ని వారి బంధువులకు కూడా తప్పనిసరిగా తెలుపాలని న్యాయమూర్తులు కోరారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి న్యాయ సహాయాన్ని అందించడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.