
సాక్షి,ముంబై : టెకీ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో బాంబేహైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో దోషులుగా తేలిన వారి ఉరిశిక్ష అమలు ఆలస్యమైన కారణంగా దోషుల శిక్షను 35 ఏళ్ల కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. తమకు విధించిన మరణశిక్షను అమలు చేయడంలో తీవ్రజాప్యం జరిగిందని, ఇది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ఈ నేపథ్యంలో తమకు విధించిన శిక్షను మార్చాలని కోరుతూ దోషులు పురుషోత్తమ్ బొరాటే, ప్రదీప్ కోకడే కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన బొంబాయి హైకోర్టు ఇద్దరికీ 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది.
12 ఏళ్ల నాటి ఈ కేసు వివరాలు : నవంబర్ 1, 2007 టెక్ దిగ్గజం విప్రోకు చెందిన బీపీవో కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళా ఉద్యోగి, విధుల నిమిత్తం క్యాబ్‌లో వెళ్తుండగా, ఆమెను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం, అతని అనుచరుడు ప్రదీప్ కలిసి అత్యాచారం చేసి అతిదారుణంగా చంపేసారు. కనీసం గుర్తుపట్టలేని విధంగా ముఖాన్ని ఛిద్రం చేసి, పొదల్లో విసిరిపారేశారు. ఈ కేసులో వీరిని అరెస్టు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సెషన్సు కోర్టులో విచారణ అనంతరం 2012 మార్చిలో వీరికి కోర్టు మరణ శిక్ష విధించగా, బాంబే హైకోర్టు, అనంతరం 2015 మే లో సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్ధించాయి. అలాగే దోషులు పెట్టుకున్న క్షమాపణ పిటిషన్‌ను 2016లో మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చగా, 2017లో రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జూన్ 24 ను వీరికి శిక్ష అమలు చేయాల్సిందిగా 2019 ఏప్రిల్10 న వారెంట్ జారీ చేసింది .
అయితే ఇక్కడే ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఉరిశిక్షను అమలు చేయడంలో 1,509 రోజులు (50 నెలలకు మించి) ఆలస్యం జరిగిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించి, ఏడు సంవత్సరాల పాటు పూణేలోని యరవాడ సెంట్రల్ జైలులో తమని అక్రమంగా నిర‍్బంధించారంటూ దోషులు ఈ ఏడాది మే నెలలో కోర్టును ఆశ్రయించారు. తమకు ఉరిశిక్షనుంచి మినహాయింపునించి, శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాల్సిందిగా కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరిశిక్ష షెడ్యూల్ ప్రకారం జరగకూడదని హైకోర్టు జూన్ 21 ఆదేశించింది. ఉరిశిక్షలపై స్టే విధించిన అనంతరం వీరి వాదనలను పరిశీలించిన జస్టిస్ భూషణ్, జస్టిస్ స్వాప్నా జోషితో కూడిన బెంచ్ శిక్షను అమలు జాప్యంతోపాటు, ఇప్పటివరకు వారు జైలులో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, శిక్షను 35 సంవత్సరాల కారాగార శిక్షగా మారుస్తూ తాజా తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment