ఐదు నిమిషాల్లో ఆనందం ఆవిరి
హైదరాబాద్: వీకెండ్ కావడంతో నగరం అందాలను తిలకించేందుకు బెంగళూరు నుంచి స్నేహితులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలో ఆనందంగా తిరిగారు. సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్‌లో బోటులో విహరిద్దామని వచ్చిన వారికి.. ఐదు నిమిషాల్లోనే అంతులేని విషాదం ఎదురైంది. స్నేహితురాలు నిర్జీవంగా మారడంతో కన్నీరుమున్నీరయ్యారు.
శనివారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో స్పీడ్‌బోట్‌ను మరో బోటు ఢీకొన్న ఘటనలో జార్ఖండ్‌కు చెందిన యువతి భక్తవార్ రాణ(22) మరణించిన సంగతి విదితమే. ఉదయం నుంచి నగరంలో ముఖ్యమైన ప్రదేశాల్లో తిరిగి సాయంత్రం హుస్సేన్‌సాగర్ వద్దకు వచ్చి 7.45కి బోటు ఎక్కామని, డ్రైవర్ అజాగ్రత్త వల్ల కొద్ది నిమిషాల్లోనే తమ బోటు వేరే బోటును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని మృతురాలి స్నేహితులు వాపోయారు.
కన్నీరుమున్నీరు...
అందరితో సరదాగా ఉండే భక్తవార్ రాణ ఇక శాశ్వతం గా తమను వదలిపోయిందని తెలిసిన తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం గాంధీ మార్చురీ వద్దకు వచ్చిన వారు ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ రోదించారు. రాణ చనిపోవడంతో సోదరుడు ఇజాజుద్దీన్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతని నోట మాటరాలేదు. బోటు ఎక్కగానే డ్రైవర్ వేగంగా నడిపించాడని, తాము నెమ్మదిగా నడపమని చెప్పినా.. మద్యం మత్తులో ఉన్న అతను వినిపించుకోలేదని స్నేహితులు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని, లేకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బోటు డ్రైవర్ శివకోటిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ శివకోటిని సస్పెండ్ చేశామని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరే షన్ ఈడీ మనోహర్ తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించాడనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు. మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే అంశం ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
క్యాంపస్ నుంచి నేరుగా విప్రోకు...
భక్తవార్ రాణది చిన్ననాటి నుంచి విషాదమే. మూడేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అన్న ఇజాజుద్దీన్ కంటికి రెప్పలా చూసుకొని పెంచాడు. చిన్ననాటి నుంచి రాణ ఎంతో కష్టపడి చదువుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని యూనివర్శిటీ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి నాలుగు నెలల క్రితమే మణికొండలోని విప్రోలో చేరింది.
మృతదేహం విమానంలో తరలింపు
పోస్టుమార్టం అనంతరం భక్తవార్ రాణ మృతదేహాన్ని సోదరుడికి అప్పగించారు. టూరిజం అధికారులు మృతదేహాన్ని విమానంలో జార్ఖండ్‌కు తరలించారు.