న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఖైదీ జైల్లో రాసుకున్న కవిత్వం అతని తలరాతను మార్చేసింది. మరణం అంచుల్లో ఉన్న అతను రాసిన కవితలను చదివిన సుప్రీం కోర్టు ధర్మాసనం మనసు కరిగి ఆ ఖైదీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను ఇటీవల యావజ్జీవ ఖైదుగా మార్చింది. మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్వర్ సురేష్ బార్కర్ అనే వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అతని తల్లిదండ్రుల్ని భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోవడంతో ఆ అబ్బాయిని చంపేశాడు. ఈ కేసును విచారించిన కింది కోర్టు బార్కర్‌కు మరణశిక్ష విధించింది. బొంబాయి హైకోర్టు కూడా అతనికి మరణశిక్షను సమర్థించింది. 22 ఏళ్ల వయసులో ఉండగా నేరం చేసిన బార్కర్ గత 18 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బార్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా బార్కర్ తరఫు లాయరు ఆయన రాసిన కవితలను సుప్రీం కోర్టుకు సమర్పించారు. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆ కవితలను చదివింది. ‘నేరస్తుడు పశ్చాత్తాప పడుతున్నాడని, మంచి మనిషిగా మారాడని అతని కవితలను బట్టి అర్థమవుతోంది. నేరస్తుడు చేసింది ఎంత పెద్ద ఘోరమో మాకు తెలుసు. అయినా అతనికి మరణ శిక్ష విధించే విషయంలో మమ్మల్ని మేం సంతృప్తి పరచుకోలేకపోతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడు సమాజంలో భాగం కావాలనుకుంటున్నాడని, నాగరికుడిగా మారాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక అతనికి మరణశిక్ష విధించడం సరికాదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment