న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చావ్లా రేప్ కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ముగ్గురు ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. పదేళ్ల కింద జరిగిన ఈ దారుణ ఘటనలో.. తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్నారు. అయితే.. సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
ముగ్గురు దోషులను సుప్రీం కోర్టు ఇవాళ నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు సమయంలో కోర్టు హాల్‌లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. అంతకు ముందు శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.
ఇక.. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని.. సమాజానిదని వాదించారు. కేవలం హత్యాచారమే చేయకుండా.. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి వాళ్లు పెద్ద తప్పు చేశారని ఆమె వాదనల్లో పేర్కొన్నారు.
ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు సీజేఐ లలిత్. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు-ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.
2012 Chhawla rape case: Supreme Court acquits three men who were awarded the death penalty by a Delhi court after being held guilty of raping and killing a 19-year-old woman in Delhi's Chhawla area in 2012 pic.twitter.com/CsbjUhROn3
— ANI (@ANI) November 7, 2022
2012 ఫిబ్రవరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గురుగావ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత.. హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ కోర్టు 2014 ఫిబ్రవరిలో ఈ ముగ్గురికి పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు చేసింది. అదే ఏడాది ఆగష్టు 26న ఢిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. మానవ మృగాలుగా దోషులను పేర్కొంటూ సమాజంలో తిరిగే హక్కును వీళ్లు కోల్పోయారంటూ ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment