
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: టెక్ సేవల సంస్థ విప్రోలో మరో ఉద్యోగి ఆకస్మిక మరణం విషాదాన్ని రేపింది. ఇటీవల తల్లిదండ్రులకు వీడ్కోలు పలికేందుకు వచ్చి, కదులుతున్న రైలు దిగబోయి విప్రో టెకీ ఒకరు మరణించిన విషాద ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చేసుకుంది. చెన్నైనుంచి బెంగళూరుకు వస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్‌కుమార్ కదులుతున్న రైల్లోంచి దిగబోతూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెఆర్ పురం రైల్వేస్టేషన్‌లో గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కిరణ్‌కుమార్(38) ఈ మధ్యనే స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో ఉంటున్నారు. అయితే తన మూడు నెలల కుమారుడిని చూసేందుకు నెల్లూరు వచ్చిన కిరణ్ అనంతరం చెన్నై మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు బయలుదేరారు. కెఆర్‌పురం స్టేషన్‌లో స్టాప్ లేక పోయినప్పటికీ, త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతలో రైలు కొద్దిగా స్లో కావడంతో దిగేందుకు ప్రయత్నించారు. అయితే అదుపు తప్పి, ప్లాట్‌ఫాం, ట్రాక్‌నకు మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయారు. తీవ్ర గాయాలతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి సత్యప్ప ధృవీకరించారు.
కాగా గత నెల డిసెంబరులో విప్రో ఉద్యోగి, కేరళకు చెందిన విక్రం విజయన్ (28) కదులుతున్న రైలునుంచి దిగడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఈశ్వరమ్మ(65) చనిపోయారు.