పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది.
గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment