మీకు పెంకా తెలుసా? | Penka the cow faces death sentence | Sakshi
Sakshi News home page

మీకు పెంకా తెలుసా?

Published Thu, Jun 7 2018 2:56 AM | Last Updated on Thu, Jun 7 2018 5:34 PM

Penka the cow faces death sentence - Sakshi

కొన్ని రోజుల క్రితం వరకు మీకే కాదు.. ఆమె యజమాని ఇవాన్‌కు తప్పిస్తే.. పెంకా అంటే ఎవరికీ తెలియదు..  ఆవులు, గేదెలు అంటే.. అలా పక్కనున్న పొలాల్లో, తోటల్లో గడ్డి మేయడం కోసం వెళ్లడం మామూలే.. పెంకా కూడా అలాగే వెళ్లింది.. అలా వెళ్లినందుకు పెంకాకు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష!!  

► పెంకా ఓ ఆవు..
బల్గేరియాలోని సరిహద్దు గ్రామం కొపిలోట్సీలో ఉంటుంది.. ఓ 20 రోజుల క్రితం గడ్డి మేస్తూ.. మేస్తూ.. అలా కొంచెం దూరం వెళ్లింది.. తోడేళ్లు వెంటపడ్డాయి.. పరిగెడుతూ.. పరిగెడుతూ అనుకోకుండా సరిహద్దును దాటింది.. సెర్బియాలోకి వెళ్లిపోయింది.. పెంకా కనిపించకపోయేసరికి ఆమె యజమాని ఇవాన్, అతని కుమారులు అన్ని చోట్లా వెతికారు. సరిహద్దు భద్రత అధికారులకు విషయం తెలియజేశారు.  

► కొన్ని రోజుల క్రితం..
పెంకా సెర్బియాలోని బోసిల్‌గ్రాడ్‌ గ్రామంలో ఉందని తెలిసింది.. ఇవాన్‌ ఆనందానికి అవధుల్లేవు.. వెంటనే బయల్దేరాడు.. బోసిల్‌గ్రాడ్‌ చేరుకున్నాడు.. దారితప్పి వచ్చిన పెంకాను అక్కడివాళ్లు బాగానే చూసుకున్నారు. పెంకా ఆరోగ్యంగానే ఉందని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని సెర్బియా పశు వైద్యుడు కూడా ధ్రువీకరించడంతో దాన్ని పట్టుకుని.. ఇవాన్‌ తిరుగు ప్రయాణమయ్యాడు.

► పేపర్స్‌ ఏవి..
ప్రశ్నించాడు బల్గేరియాలోని సరిహద్దు భద్రతాధికారి.. పేపర్స్‌ ఏమిటి అన్నాడు ఇవాన్‌. పెంకా దారి తప్పిన విషయం చెప్పాడు.. యూరోపియన్‌ యూనియన్‌ రూల్స్‌ గురించి తెలియవా అంటూ çహూంకరించాడా అధికారి. బల్గేరియా ఈయూ సభ్య దేశం.. సెర్బియా కాదు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా.. ఈయూ సభ్యదేశంలోని వారు వేరే దేశానికి వెళ్లడం.. తగు పత్రాలు లేకుండా తిరిగి దేశంలోకి రావడం నిషేధం.. వాళ్ల లెక్క ప్రకారం పెంకా అక్రమంగా సరిహద్దు దాటింది.. ఇప్పుడు కూడా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటి రావాలని చూస్తోంది.  అక్కడి చట్టాల ప్రకారం ఆ అపరాధానికి శిక్ష.. మరణమే..

► మరికొన్ని రోజులే..
ఇవాన్‌కు చెప్పాడు అతడి గ్రామంలోని పశువైద్యుడు. నేను చేయగలిగింది ఏమీ లేదు.. చట్టాలు అలాగున్నాయని అన్నాడు.. పెంకా అక్రమంగా సరిహద్దు దాటడమొక్కటే కాదు.. సెర్బియా నుంచి ఏమైనా రోగాలను మోసుకొచ్చిందేమోనన్న అనుమానం కూడా అధికారులకు ఉంది. అలాగని పరీక్షలు చేయలేదు. సెర్బియా వైద్యుడు పరీక్ష చేసి ఇచ్చిన పత్రాన్నీ నమ్మలేదు.పెంకాకు మరణ శిక్ష విధించడంపై తొలుత అక్కడి సోషల్‌మీడియాలో గగ్గోలు రేగింది. తర్వాత తర్వాత అది ఈయూ అంతా వ్యాపించింది. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది.. ఏమిటి హద్దు.. ఏమిటి సరిహద్దు అన్నది పశువులకు ఎలా తెలుస్తుంది? చట్టాలు కఠినమే.. కానీ కామన్‌సెన్స్‌ అన్నది కూడా ఒకటుండాలిగా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. పెంకాను రక్షించాలంటూ సంతకాల ఉద్యమమూ ఉధృతమైంది. ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతటా పెరిగింది.

► మీకో విషయం తెలుసా?  
పెంకా.. గర్భవతి.. రెండు, మూడువారాల్లో మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది.. మరి.. పెంకా బతుకుతుందా? మరో బుల్లి పెంకాకు బతుకునిస్తుందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement