
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ నుంచి విడిపోయాక మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది. ప్రేమ, మాతృత్వం, కెరీర్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది.
గతేడాది జులైలో హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్‌లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్‌కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.
ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్‌గా ఉన్నాను. సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను. నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.
హార్దిక్ నుంచి విడిపోయాక గతేడాది చాలా కఠినంగా గడిచిందని నటాసా పేర్కొంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎదుగుదల సాధిస్తామని చెప్పింది. గతేడాది చెడుతో పాటు మంచి అనుభవాలు కూడా ఉన్నాయని అంది. వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణతి చెందుతామని చెప్పుకొచ్చింది.
కెరీర్ గురించి మాట్లాడుతూ.. హార్దిక్‌తో పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌కు ఐదేళ్లు దూరంగా ఉన్నాను. తిరిగి కెరీర్‌ను పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. కష్టపడి పని చేస్తూ, నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడే వ్యక్తిని కాబట్టి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏదీ వీలు కాకపోతే మరో కెరీర్‌ను ఎంచుకుంటాను.
నటాసా మార్చి 4వ తేదీన తన 33వ పుట్టిన రోజు జరుపుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. అగస్త్యతో చాలా సరదాగా గడిపాను. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాది నాకు కెరీర్‌పరంగా, పర్సనల్‌గా చాలా ప్రత్యేకమైంది.
సెర్బియాకు చెందిన నటాసాను హార్దిక్ పాండ్యా 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నటాసాను విడిపోయాక హార్దిక్ క్రికెట్‌తో బిజీ అయిపోయాడు. ఇటీవలే టీమిండియా సభ్యుడిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన హార్దిక్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. హార్దిక్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.