కోలారు: గో హత్యలు చేసే వారికి మరణ దండన వంటి కఠిన శిక్షలు విధించాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అప్పుడే ఆ హత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని గంగాపుర గ్రామంలో అభయ మంగళ గో యాత్ర ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. గోహత్యలు మానవ హత్యలతో సమానమైనవి కావడం వల్ల వీటి హంతకులకు కూడా మరణ శిక్షలు విధించాలని, ఇందుకు తగినట్లు చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు. దీనిపై తాను పార్లమెంట్‌లో త్వరలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టబోతున్నానని వెల్లడించారు. గో రక్షణ నిధుల కోసం 1 శాతం సెస్సు విధించాలని, గోవులకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చైనాలో గోవధ వల్ల గో సంతతి తగ్గి నేడు సోయాబీన్స్‌తో తయారు చేసిన పాలను ఉపయోగిస్తున్నారని, ఈ పరిస్థితి మన దేశంలో రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఈ సందర్భంగా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రధానికి అభయ మంగళ గో యాత్ర కార్యకర్తలు రక్తాక్షరాలతో లేఖలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment