ముగ్గురికి మరణశిక్ష
మరో ముగ్గురికి జీవిత ఖైదు
కమ్దుని ‘హత్యా’చారం కేసులో కోర్టు తీర్పు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కమ్దునిలో రెండేళ్ల క్రితం జరిగిన కాలేజీ విద్యార్థిని(21) గ్యాంగ్‌రేప్, హత్య కేసులో కోర్టు ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవితఖైదు ఖరారుచేసింది. కోల్‌కతాలోని అదనపు సెషన్స్ జడ్జి సంచిత సర్కార్ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. మరణశిక్ష పడినవారిలో అమినుల్ అలీ, సైఫుల్ అలీ, అన్సార్ అలీ ఉన్నారు. ఇమానుల్ ఇస్లాం, అమినుల్ ఇస్లాం, భోలా నాస్కర్‌లకు జీవితఖైదు విధించారు.
ఇది అత్యంత అరుదైన కేసు కాదు కాబట్టి దోషులకు మరణశిక్ష విధించొద్దని వారి న్యాయవాదులు వాదించారు. అయితే ప్రాసిక్యూషన్ న్యాయవాదులు వారికి మరణదండన విధించాల్సిందేనని గట్టిగా వాదించారు. బాధితురాలి గాయాలను చూస్తుంటే దోషులు అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందన్నారు. ఏకీభవించిన జడ్జి.. ముగ్గురు దోషులకు మరణశిక్షను ఖరారు చేశారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న రఫీకుల్ ఇస్లాం, నూర్ అలీలకు పాత్రను ధ్రువీకరించే సాక్ష్యాలు లేనందున వారిని గురువారం కోర్టు నిర్దోషులగా విడుదల చేసింది. మరో నిందితుడు విచారణ జరుగుతున్న కాలంలోనే చనిపోయాడు.
24 పరగణాల జిల్లాలో.. కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలోని కమ్దుని గ్రామంలో 2013 జూన్ 7న కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బీఏ చదువుతున్న విద్యార్థిని తన కాలేజీలో పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా దారుణానికి ఒడిగట్టారు. పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.