మృగాడిగా మారితే... మరణశిక్షే | Death Penalty For Rape Case Convicts In Warangal District | Sakshi
Sakshi News home page

మృగాడిగా మారితే... మరణశిక్షే

Published Sat, Aug 10 2019 1:28 PM | Last Updated on Sat, Aug 10 2019 1:41 PM

Death Penalty For Rape Case Convicts In Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌ : ప్రస్తుత వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రధా న ద్వారం.. గతంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోలీసు హెడ్‌క్వార్ట ర్స్‌ ముఖ ద్వారానికి అటూఇటు పరిశీలిస్తే ఎడమ పక్క పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ అనీ, మరోపక్క ‘ఎవర్‌ విక్టోరియస్‌’ అని పెద్ద అక్షరాలతో ఉంటుం ది. దీనికి అర్థం ‘ఎప్పుడూ విజేతలే’ అని! దీనిని సార్థకం చేసుకునేలా వరంగల్‌ పోలీసు పనితీరు ఉంటోంది. తాజాగా తొమ్మిది నెలల చిన్నారి పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు 48 రోజు ల్లో ఉరిశిక్ష పడేలా దర్యాప్తు చేసిన పోలీసులను ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయాన్ని, పోలీసు తీరుపై వచ్చిన విమర్శలను కాసేపు పక్కన పెడితే... మగాళ్లు మృగాళ్లుగా మారితే ఇక అంతేనన్న విషయం మాత్రం సుస్పష్టం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత కొన్నేళ్లుగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇది నిజమేనని అంగీకరించాల్సి ఉంటుంది.

సాంకేతిక పరిజ్ఞానం
చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్‌ పోలీసుల దర్యాప్తు తీరు మరోసారి మార్మోగింది. ఇక్కడి పోలీసులకు వర్‌ విక్టోరియస్‌(ఎప్పుడు విజేతలే)గా ఉన్న పేరు మరోసారి నిజం చేసుకున్నట్లయింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వారు కేసులను త్వరితగతిన చేధిస్తున్నారు. శ్రీహిత కేసును రికార్డు స్థాయిలో 48 రోజుల్లోనే తీర్పు వచ్చేలా కేసుకు సంబంధించి అన్ని రకాల సాక్షాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎక్కడ కూడా కేసు వీగిపోకుండా తీసుకున్న జాగ్రత్తలే పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడడానికి కారణమయ్యాయి. గతంలో సైతం పోలీసులు తీసుకున్న నిర్ణయాలు, ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మరోసారి కూడా దక్కింది. ఈ మేరకు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పలు ఘటన వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

అశోక్‌రెడ్డి కేసులో 16మందికి యావజ్జీవం
హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన గౌరు అశోక్‌రెడ్డితో జరిగిన స్థానిక గొడవలను పెద్దగా తీసుకున్న కొందరు 4 మార్చి 2012న హత్య చేశారు. అశోక్‌రెడ్డి భార్య ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఇన్‌స్పెక్టర్‌ మోజెస్‌ సుమారు 27 మందిని సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యాన్ని పకడ్బందీగా సేకరించారు. దీంతో పాటే అశోక్‌రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న 27 మంది ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, వెనక్కి తగ్గకుండా నిజం చెప్పేలా పోలీసులు వారికి ధైర్యం, భరోసా కల్పించారు. ఈ కేసులో తీర్పు ఈనెల 5వ తేదీన వచ్చిందంటే ఏడేళ్లకు పైగా సాక్షులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కాపాడగలిగారు. దీంతో కోర్టు నిందితులు 16 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జిల్లాలో ఒకేసారి ఇంత మందికి యావజ్జీవం పడటం సంచలనం కలిగించడమే కాకుండా పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

కమిషనరేట్‌లో 82 పీడీ యాక్టు కేసులు
నేరం చేయాలంటే వెన్నులో భయం పుట్టేలా ప్రస్తుత వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ నేరం చేసే వ్యక్తులు మరోసారి నేరం చేయకుండా ఉండేలా పీడీ యాక్టు నమోదు చేస్తున్నారు. అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ రకాల నేరాలు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై ఇప్పటి వరకు 82 పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు.

పెట్రోల్, యాసిడ్‌ దాడులు... పీడీ యాక్టు
ప్రేమ నిరాకరించిందన్న కోపంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న హన్మకొండ కిషనపురలో హాస్టల్‌ నుంచి కళాశాలకు వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని తోపుచర్ల రవళిపై సాయి అన్వేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. రవళి తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మార్చి 4న తుదిశ్వాస విడిచింది. అనంతరం మే 18న నిందితుడు సాయి అన్వేష్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే, 2017లో ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో వివాహిత బోయిన మాధవిపై యాసిడ్‌తో దాడి చేయగా ఆమె మృతి చెందింది. ఈ కేసులో నిందితులు కల్వల చంద్రశేఖర్, అడెపు అనిల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించడంతో పాటు వారిపై పీడీ యాక్టు నమోదు చేశారు.

యాసిడ్‌ దాడి... ఆపై ఎన్‌కౌంటర్‌
రాష్త్రంలో తీవ్ర సంచలనం కలిగించిన యాసిడ్‌ దాడి సంఘటన 2008 డిసెంబర్‌లో హసన్‌పర్తి మండలం భీమారం దగ్గర జరిగింది. కిట్స్‌ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతపై శాఖమూరి శ్రీనివాస్‌ ఇద్దరు స్నేహితులతో కలిసి యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన స్వప్నిక చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రణీత తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోగా.. సాక్షాల సేకరణ సమయంలో వారు తప్పించుకునేందుకు యత్నించగా ఎన్‌కౌంటర్‌ చేయడంతో ముగ్గురూ మృతి చెందారు. ఆ సమయంలో ప్రజలు తండోపతండాలుగా, స్వతంత్రంగా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని ఎస్పీ సజ్జనార్‌ను భుజాలపై ఎత్తుకుని జేజేలు కొట్టారు. ఆ సమయంలో ‘తప్పు చేస్తే వరంగల్‌ పోలీసులు వదలరు’ అనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

జంట హత్యకేసు... 24 గంటల్లో ఛేదన
హసన్‌పర్తి మండల కేంద్రంలో 2018 జూన్‌ 18న గడ్డం దామోదర్, గడ్డం పద్మ దంపతుల హత్య జరిగింది. ఈ కసులో నిందితుడు కామరపు ప్రశాంత్‌ను హసన్‌పర్తి పోలీసులు 24 గంటల్లోపే అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక కేసుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుల పక్షాన నిలిచి న్యాయం జరిగేలా చేసిన కృషితో పోలీసు అధికారులు, సిబ్బంది కీర్తి పెరిగిపోతోంది.

మనీషా కిడ్నాప్‌... ముగ్గురు ఎన్‌కౌంటర్‌
వరంగల్‌కు చెందిన పత్తి వ్యాపారి కుమార్తె మనీషాను 2008లో కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్ర ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లను అర్థం చేసుకుని కేసులో ముందుకు సాగారు. డబ్బు కోసం అభంశుభం తెలియని పాప మనీషాను నిర్ధాక్షిణంగా హత్య చేసిన ముగ్గురిని విచారించే  క్రమంలో ధర్మసాగర్‌ మండలం తాటికాయల వ్యవసాయ బావి వద్ద ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ ఘటనలో కూడా వరంగల్‌ పోలీసులకు ప్రజల నుంచి మద్దతు.. ఎస్పీ సౌమ్యామిశ్రాకు ప్రశంసలు లభించాయి.

సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది
శ్రీహిత కేసులో నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడడంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది. ప్రజలకు ఇంకా సేవ చేయాలనే తపన వస్తోంది. ఇలాంటి కేసుల్లో విజయం వల్ల పోలీసులు మరింత స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో న్యాయం జరగడం వల్ల ప్రజల్లో మాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మేం మరింత బాధ్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. – డాక్టర్‌ రవీందర్, వరంగల్‌ సీపీ 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement