చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే | Union Cabinet clears ordinance awarding death penalty for child rape | Sakshi
Sakshi News home page

చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే

Published Sun, Apr 22 2018 1:14 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

Union Cabinet clears ordinance awarding death penalty for child rape - Sakshi

ఢిల్లీలో ఇండియాగేట్‌ వద్ద 200 అడుగుల జెండాతో నిరసన తెలుపుతున్న దృశ్యం

న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నడుం బిగించింది. కఠువా, సూరత్‌ల్లో మైనర్‌ బాలికలపై అత్యాచారం, హత్య.. ఉన్నావ్‌లో బాలికపై అత్యాచార ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్‌ భేటీలో క్రిమినల్‌ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌కు ఓకేచెప్పారు. అత్యాచార కేసుల విచారణకు కొత్తగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసుల దర్యాప్తు కోసం అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్‌ కిట్లను ఇవ్వనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ ఆర్డినెన్స్‌ తక్షణం అమల్లోకిరా నుంది. ఆర్డినెన్స్‌లోని సవరణల్ని బిల్లు రూపంలో ఆమోదం కోసం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.  

గరిష్టంగా మరణించేంత వరకూజైలు లేదా మరణశిక్ష
తాజా ఆర్డినెన్స్‌ ప్రకారం 12 ఏళ్లు, 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మరణశిక్షను ఖరారు చేశారు. 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే కనిష్ట శిక్ష 20 ఏళ్లు కాగా గరిష్టంగా దానిని యావజ్జీవంగా(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించడం లేదా మరణశిక్ష అమలు చేయవచ్చు. 12ఏళ్లలోపు బాలికను గ్యాంగ్‌రేప్‌ చేస్తే మరణించేంతవరకూ జైలుశిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు.

16 ఏళ్ల లోపు బాలికను రేప్‌ చేసే వారికి ప్రస్తుతం విధిస్తున్న 10 ఏళ్ల కనిష్ట శిక్షను 20 ఏళ్లకు పెంచారు. శిక్షను గరిష్టంగా యావజ్జీవ కారాగారంగా (మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించవచ్చు. 16 ఏళ్ల లోపు బాలికను గ్యాంగ్‌రేప్‌ చేస్తే యావజ్జీవ శిక్ష(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) విధిస్తారు. మహిళను రేప్‌చేస్తే కనిష్ట శిక్షను పదేళ్లకు పెంచారు. గరిష్టంగా జీవిత ఖైదు వేస్తారు. ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదించగానే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), ద ఎవిడెన్స్‌ యాక్ట్, ద కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసిజర్‌(సీఆర్‌పీసీ), లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో) చట్టాల్లో చేసిన  సవరణలు అమల్లోకి వస్తాయి.  

కఠిన శిక్షల కోసం ఆర్డినెన్స్‌లో పలు నిబంధనలు
రేప్‌ కేసుల్లో కఠిన శిక్షల కోసం న్యాయవ్యవస్థ అధికారాల్ని విస్తృతం చేస్తూ ఈ ఆర్డినెన్స్‌లో అనేక చర్యల్ని కేబినెట్‌ రూపొందించింది. విచారణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, రాష్ట్రాలు, హైకోర్టుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాట్లు మొదలైనవి అందులో ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 524 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులుండగా అందులో అత్యధికంగా యూపీలో 183, మహారాష్ట్రలో 100, తమిళనాడులో 39, ఏపీలో 39, తెలంగాణలో 34 ఉన్నాయి.  దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 1800 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని 14 వ ఆర్థిక సంఘం గతంలో సూచించింది.

కేసుల దర్యాప్తు కోసం సుశిక్షితులైన సిబ్బంది
కొత్తగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పదవుల్ని ఏర్పాటు చేయడంతో పాటు అత్యాచార కేసుల కోసం దీర్ఘకాలంలో అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు అధునాతన ఫోరెన్సిక్‌ కిట్లను అందచేస్తారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తును పూర్తి చేసేలా సుశిక్షితులైన అంకిత భావంతో పనిచేసేవారిని ఈ కేసుల కోసం ప్రత్యేకంగా నియమిస్తారు. రేప్‌ కేసుల కోసమే ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రత్యేక ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లోపు ప్రారంభంకానున్న ప్రాజెక్టులో భాగమని వెల్లడించారు.  

‘నిర్భయ’ తర్వాత అమల్లోకి కఠినశిక్షలు
అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా 2012 నాటి నిర్భయ ఘటన తర్వాత ప్రభు త్వం చట్టం తెచ్చింది. 12 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నామని శుక్రవారం కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది.

ఆ 8 దేశాల సరసన భారత్‌
లైంగిక నేరగాళ్లకు సంబంధించిన వారి వివరాలను సేకరించి తర్వాత వారిపై ఓ కన్నేసి ఉంచే 8 దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్‌ టొబాగో దేశాలు ప్రస్తుతం లైంగిక నేరగాళ్ల కదలికలపై నిఘా పెడుతున్నాయి. వీటిలో లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉండగా మిగిలిన దేశాల్లో న్యాయ, విచారణ సంస్థలకు మాత్రమే ఆ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మంత్రివర్గం నిర్ణయంతో ఇకపై భారత్‌లోనూ లైంగిక నేరగాళ్లపై నిఘా పెట్టనున్నారు. అయితే ఇది లైంగిక నేరగాళ్లపై సామాజికంగా చెడు ముద్ర వేస్తుందనీ, పునరావాసం అనే ప్రక్రియకు అర్థం లేకుండా పోతుందని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

నాలుగు నెలల చిన్నారిని చిదిమేశాడు
ఇండోర్‌: కఠువా, ఉన్నావ్‌ దారుణ ఘటనల్ని మర్చిపోకముందే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మృగాడు రెచ్చిపోయాడు. తల్లిదండ్రులతో నిద్రపోతున్న నాలుగు నెలల పసిపాపను ఎత్తుకెళ్లిన నీచుడు.. ఆమెపై అత్యాచారం చేసి ఎత్తైన భవనం పైనుంచి విసిరేశాడు. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడు, బాధితురాలి తల్లి బంధువైన నవీన్‌ గాడ్గే(24)ను అరెస్ట్‌ చేశారు. ఈ విషయమై ఇండోర్‌ డీఐజీ హెచ్‌సీ మిశ్రా మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల క్రితమే నవీన్‌ భార్య అతని నుంచి విడిపోయింది.

దీంతో రజ్వాడా ప్రాంతంలో ఉంటున్న బాధితురాలి తల్లి వద్దకు నిందితుడు గురువారం వెళ్లాడు. తన భార్యను కాపురానికి రావాల్సిందిగా ఒప్పించాలని తన బంధువైన బాలిక తల్లిని కోరాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో నవీన్‌ వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు అక్కడికి చేరుకున్న నిందితుడు.. రోడ్డుపక్కనే తల్లిదండ్రులతో నిద్రపోతున్న బాలికను భుజాలపై ఎత్తుకుని 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ వాణిజ్య భవనం బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం చిన్నారిని అదే భవనం పైనుంచి విసిరేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని గుర్తించాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశారనీ, ఆమె మర్మాంగాలతో పాటు తలపై గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నిర్వహించిన ఎంవై ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించడంలో అలసత్వం వహించిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ త్రిలోక్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు.

కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
లైంగిక నేరాలకు పాల్పడే వారి సమగ్ర సమాచారం, వ్యక్తిగత వివరాల్ని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో భద్రపరుస్తుంది. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పర్యవేక్షణ, దర్యాప్తు కోసం ఆ వివరాల్ని క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంటారు. అలాగే లైంగిక నేరాలకు పాల్పడిన వారి గత ప్రవర్తనను పోలీసుల ద్వారా నిర్ధారించుకుంటారు. బాధితురాలికి సాయం అందించేందుకు ప్రస్తుతం అమల్లోకి ఉన్న ‘వన్‌ స్టాప్‌ సెంటర్ల’ను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. ‘అత్యాచార ఘటనల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌ ఉత్తమ మార్గం. దీనిని బిల్లుగా మార్చేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల(జూలై) వరకూ వేచి ఉండాలి’ అని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మోదీజీ మౌనమేల?  
కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 600 మంది విద్యావేత్తలు, స్కాలర్స్‌ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దారుణ నేరాలకు ఒడిగట్టిన వారిని సంబంధిత రాష్ట్రాలు రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ అకృత్యాలపై స్పందించకుండా చాలా రోజులు మౌనం వహించారంటూ ప్రధాని మోదీని వారు తప్పుపట్టారు. లేఖ రాసిన వారిలో న్యూయార్క్‌ వర్సిటీ, హార్వర్డ్‌ వర్సిటీ, కొలంబియా వర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు.

తీర్పుపై అప్పీళ్లను ఆరు నెల్లలోపు పరిష్కరించాలి
వేగవంతమైన దర్యాప్తు, విచారణ కోసం ఆర్డినెన్స్‌లో ప్రమాణాల్ని పొందుపరిచారు. అన్ని రేప్‌ కేసుల్లో దర్యాప్తును తప్పనిసరిగా రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. అలాగే రేప్‌ కేసుల్లో కోర్టు విచారణ రెండు నెలల్లో ముగించాలి. దోషిగా శిక్ష ఎదుర్కొనే వ్యక్తి అప్పీళ్లను ఆరునెల్లలోపు పరిష్కరించాలి. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం, సామూహిక అత్యాచారం పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలాంటి ముందస్తు బెయిల్‌ ఇవ్వరు. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం కేసులో బెయిల్‌ దరఖాస్తును నిర్ణయించే ముందు.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, బాధితురాలి తరఫు ప్రతినిధికి కోర్టు 15 రోజుల నోటీసు ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement