న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం ఎన్నో మలుపులు తిరుగుతూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన నోరు విప్పారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్‌కీ పనిష్మెంట్ ఇవ్వాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేశారు.
అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని తెలిపారు.
సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్తాబ్‌తో వెళ్లిన తర్వాత కూతుర్ని ఇంటికి రాకుండా అన్ని దారులు మూసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు.
తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు. కాగా, అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి.
చదవండి: 15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్‌లో మేనేజర్‌గా అవతారం ఎత్తి..
Comments
Please login to add a commentAdd a comment