వాషింగ్టన్: అమెరికాలో పది నెలల చిన్నారి శాన్వీతో పాటు ఆమె నాయనమ్మ సత్యవతి(61)ని 2012లో అతి కిరాతకంగా హత్యచేసిన కేసులో భారత సంతతి అమెరికన్ రఘునందన్ యండమూరి(32)కి ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలుచేయనున్నట్లు స్థానిక జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో రఘునందన్ డబ్బుకోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు కోర్టుకు చెప్పారు. తొలుత ఈ హత్యలు చేసింది తానేనని అంగీకరించిన రఘునందన్ తర్వాత మాట మార్చాడు. తాను కేవలం దొంగతనానికి మాత్రమే పాల్పడ్డాననీ, ఈ హత్యలకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.
ఈ హత్యల్ని ఇద్దరు అమెరికన్లు చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ నుంచి ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ అయింది. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా కోర్టు చివరికి 2014, అక్టోబర్ 14న రఘునందన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ 2015లో విధించిన మారిటోరియం కారణంగా ఈ శిక్ష అమలు వాయిదా పడే అవకాశముందని జైలు అధికారులు వెల్లడించారు.
ఒకవేళ గవర్నర్ శిక్ష అమలు కోసం నిర్ణీత గడువులోగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుంటే జైళ్లశాఖ కార్యదర్శి 30 రోజుల్లోగా దోషికి విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించాలని ఆదేశాలు జారీచేయవచ్చని అన్నారు. ప్రస్తుతం రఘునందన్‌కు శిక్ష అమలు విషయమై పెన్సిల్వేనియా టాస్క్ ఫోర్స్, సలహా కమిటీల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజా ఘటనతో అమెరికాలో మరణదండన ఎదుర్కొంటున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా రఘునందన్ నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘునందన్ హెచ్1బీ వీసాతో అమెరికాకు వెళ్లాడు. శాన్వీతో పాటు ఆమె నాయనమ్మను హత్యచేసిన ఇతను విచారణ సందర్భంగా తన లాయర్లు హిల్లెస్, హెక్‌మన్‌ల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశాడు. ఫోన్లు చేసినప్పటికీ, లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదన్నాడు. మళ్లీ విచారణ కోరడానికి బదులుగా తనకు విధించిన మరణశిక్షను వెంటనే అమలు చేయాలని పలుమార్లు కోర్టు హాల్లోనే డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment