ఆ నలుగురిని ఉరి తీయాల్సిందే: హైకోర్టు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన మరణ శిక్షను న్యాయస్థానం సమర్థించింది. నిందితులకు శిక్షను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈకేసులో ఇప్పటికే నలుగురికి దిగువకోర్టు గత ఏడాది సెప్టెంబర్ లో ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ముఖేష్ సింగ్, వినయ్‌శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లకు ఉరిశిక్ష విధించగా....ఆ శిక్షలను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.
ఎప్పుడేం జరిగింది..?
డిసెంబర్ 16, 2012: దేశ రాజధానిలో 23 ఏళ్ల నిర్భయపై ఆరుగురు కిరాతకుల సామూహిక అత్యాచారం. ప్రైవేటు బస్సులో దారుణానికి పాల్పడి చావుబతుకుల మధ్య ఉన్న యువతిని, ఆమె స్నేహితుడిని నడిరోడ్డుపై వదిలేసి పరార్. యువతిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చిన ఆమె స్నేహితుడు.
17: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. నలుగురు నిందితులు రాంసింగ్ (బస్సు డ్రైవర్), అతడి సోదరుడు ముకేష్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలను గుర్తించిన పోలీసులు.
18: రాంసింగ్‌తోపాటు మిగతా ముగ్గురి అరెస్టు.
21: గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడినవారిలో మైనర్ అరెస్టు. ఆరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ కోసం బీహార్, హర్యానాలో ముమ్మర గాలింపు.
21, 22: బీహార్‌లో ఠాకూర్ అరెస్టు. ఆసుపత్రిలో మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం.
23: దేశ రాజధానిలో మిన్నంటిన ఆందోళనలు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్లెక్కిన ప్రజలు. ఆందోళనకారుల చేతిలో గాయాలపాలైన కానిస్టేబుల్ సుభాష్ టొమార్.
25: బాధితురాలి పరిస్థితి విషమం. కానిస్టేబుల్ సుభాష్ మృతి.
26: మెరుగైన చికిత్స కోసం నిర్భయను సింగపూర్‌కు తరలించిన ప్రభుత్వం.
29: మృత్యువుతో పోరాడుతూ నిర్భయ కన్నుమూత.
జనవరి 2,2013: లైంగిక నేరాల్లో సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిన నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్.
3: ఐదుగురు నిందితులపై హత్య, గ్యాంగ్‌రేప్, కిడ్నాప్ అభియోగాలు
17: ఐదుగురు నిందితులపై విచారణను ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.
ఫిబ్రవరి 28: మైనర్ నిందితుడిపై అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న జువైనల్ కోర్టు.
మార్చి 11: తీహార్ జైల్లో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య.
2: కోర్టు విచారణకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్‌కు జాతీయ మీడియాకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు.
జూలై 5: కేసులో మైనర్‌పై విచారణను ముగించిన జువైనల్ కోర్టు.
11: కేసులో మైనర్ నేరాన్ని ధ్రువీకరించిన న్యాయస్థానం.
ఆగస్టు 22: నలుగురు నిందితులపై తుది వాదనలు విన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.
31: మైనర్ నేరాన్ని ధ్రువీకరించి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు.
సెప్టెంబర్ 3: కేసులో విచారణను ముగించి తీర్పును వాయిదా వేసిన కోర్టు.
10: ముకేష్, వినయ్, అక్షయ్, పవన్‌లను 13 నేరాలకు సంబంధించి దోషులుగా గుర్తిస్తూ కోర్టు తీర్పు.
11: శిక్ష ఖరారును వాయిదా వేసిన న్యాయస్థానం.
13: నలుగురు దోషులకు మరణ శిక్ష విధించిన కోర్టు.