నిర్భయ కేసులో ఏడాది గడిచినా.. ఉరి తీయలేదు!!
దేశ రాజధాని నగరంలో కదులుతున్న బస్సులో ఓ అబలపై (నిర్భయ) సామూహిక అత్యాచారం జరిగి ఏడాది గడిచిపోయింది. కానీ ఇంతవరకు న్యాయప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. ఆమె పేరుతో పార్లమెంటు ఏకంగా ఓ ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయినా ఇంకా బతికున్న నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేయలేదు. దీనిపై ఢిల్లీ హైకోర్టు తీర్పు జనవరిలో వెలువడవచ్చని న్యాయవాదులు అంటున్నారు. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులు వినిపిస్తున్న వాదనలను ఢిల్లీ హైకోర్టు ఇంకా వింటోంది. డిఫెన్సు తరఫున తన వాదనలను ఇక వచ్చే వారంలో ముగిస్తానని, ఆ తర్వాత కోర్టు సెలవులు మొదలవుతాయని, బహుశా జనవరి రెండోవారంలో తీర్పు వెలువడవచ్చని ముఖేష్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ తెలిపారు. వాదనలు ముగిసిన తర్వాత ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. జనవరిలోనే తీర్పు రావచ్చని మరో ఇద్దరు నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్ చెప్పారు.
అయితే, డిఫెన్సు న్యాయవాదుల తీరు చూస్తే తీర్పు అంత త్వరగా రాకపోవచ్చని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరిస్తున్న దయన్ కృష్ణన్ అన్నారు. కావాలని పదేపదే వాయిదాలు కోరుతూ కేసును సాగదీస్తున్నారని ఆయన శర్మపై ఆరోపించారు. దీన్ని కోర్టు కూడా గమనించిందన్నారు. నిందితులను వీలైనంత త్రవగా ఉరి తీయాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేశంగా అన్నారు. నలుగురు నిందితులు ముఖేష్ (26), అక్షయ్ ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్ శర్మ (20)లకు మరణ శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 13నే తీర్పు ఇచ్చింది. అయితే తర్వాత ఉరిని నిర్ధారించేందుకు హైకోర్టుకు పంపింది.
ఒక మైనర్ నిందితుడు సహా మొత్తం ఆరుగురు నిర్భయపై దారుణంగా అత్యాచారం చేసి చిత్ర హింసలు పెట్టారు. దాంతో ఆమె సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. చివరకు రైజినా హిల్స్ను సైతం ఉద్యమకారులు ముట్టడించారు. పోలీసులు నిరసనకారులను ఇనుప పాదాలతో అణిచేశారు. ఇంత పెద్ద ఉద్యమం వచ్చిన తర్వాతే కేంద్రం నిర్భయ చట్టం చేసింది.