మరో నిర్భయ ఘటన.. మహిళ దారుణహత్య
హరియాణాలో ఘోరం జరిగింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది రోజులకే దాదాపు అలాంటి ఘటనే మరింత ఘోరంగా జరిగింది. ఓ మహిళపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, తర్వాత ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె తలను ఛిద్రం చేసేశారు. ఆమె తలను తమ వాహనంతో తొక్కించేశారు. ఈ ఘోరం హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో జరిగింది. నిర్భయ ఘటనలో జరిగినట్లే.. అత్యాచారం చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ఛిద్రం చేశారు. ఈ ఘటన మే 9వ తేదీన జరిగినా.. నాలుగు రోజుల తర్వాత రోహ్‌తక్‌లోని ఐఎంటీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ తన ఆఫీసుకు వెళ్తుండగా ఏడుగురు వ్యక్తులు ఆమెను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిర్భయ ఘటనలో జరిగినట్లే అత్యాచారం చేసిన తర్వాత ఏదో పదునైన వస్తువు దూర్చడంతో ఆమె శరీరంలోని అంతర్గత భాగాల్లో కూడా తీవ్రమైన గాయాలు అయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు మే 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించగా, చివరకు ఐఎంటీ ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ముఖాన్ని గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఆమె తల మీద నుంచి వాహనం పోనిచ్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘోరంలో తమ పక్కింటి వాళ్ల హస్తం ఉండి ఉంటుందని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే నిందితులు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది.