నిర్భయ కేసులో నిందితుడు వినయ్‌శర్మ బుధవారంరాత్రి తిహార్ జైలులో ఆత్మహత్యకు యత్నించాడు.
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు వినయ్‌శర్మ బుధవారంరాత్రి తిహార్ జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. వినయ్ కొన్ని మాత్రలు మింగడంతోపాటు కిటికీకి తువ్వాలుతో ఉరేసుకోవడానికి యత్నిస్తుండగా తమిళనాడుకు చెందిన జైలు సిబ్బంది గమనించి అడ్డుకున్నారు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని జైలు సూపరింటెండెంట్ బిజేంద్రకుమార్ తెలిపారు. గట్టి భద్రత మధ్య జైలులోని 8వ నంబర్ సెల్‌లో శర్మ ఉన్నాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడో తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ఆయనపై హత్యాయత్నం జరిగిందని శర్మ న్యాయవాది ఏపీ సింగ్ ఆరోపించారు. తోటి ఖైదీలు, పోలీసులు తనను కొడుతున్నందున భద్రత కల్పించాలని 2013లో శర్మ డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితం జైలును సందర్శించినప్పుడు జైలులోపల తనను వేధింపులకు గురి చేస్తున్నారని వినయ్‌శర్మ తనతో చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు.