జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేస్తాం
చార్జ్‌షీట్, తీర్పు కాపీలు ఇవ్వాలని పాక్‌ను కోరిన భారత్
► దౌత్య అనుమతి కోసం మరోసారి విజ్ఞప్తి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షపై అప్పీలుకు వెళ్తామని భారత్ స్పష్టం చేసింది. జాధవ్‌పై దాఖలైన చార్జిషీట్ వివరాలతో పాటు మరణశిక్ష విధిస్తూ పాక్ సైనిక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాపీల్ని అందించాలని పాక్‌ను కోరింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలతో జాధవ్‌కు ప్రమేయ ముందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగానే మరణశిక్ష విధించామని, 40 రోజుల్లో తీర్పుపై అప్పీలుకు వెళ్లవచ్చని పాక్ పేర్కొంది. జాధవ్‌ను కలిసేందుకు దౌత్య అనుమతిని పాక్ తిరస్కరించిన నేపథ్యంలో.. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతం బాంబావాలే శుక్రవారం పాక్‌విదేశాంగ కార్యదర్శి టెహ్‌మినా జంజువాను కలిశారు.
ఈ సందర్భంగా జాధవ్‌ను కలిసేందుకు దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలని మరోసారి కోరారు. బాంబావాలే మాట్లాడుతూ.. ‘తీర్పుపై మనం తప్పకుండా అప్పీలుకు వెళ్లాలి. అయితే చార్జ్‌షీట్, తీర్పు కాపీలు లేకుండా ఏమీ చేయలేం. ముందుగా పాక్ వాటిని భారత్‌కు అందించాలి’ అని తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952, అధికారిక రహస్య చట్టం 1923ల కింద జాధవ్‌పై విచారణ నిర్వహించామని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జంజువా పేర్కొన్నారు. భారత్ జైళ్లలో ఉన్న పాకిస్తానీయులతో మాట్లాడేందుకు దౌత్య అనుమతి కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తీర్పుకు వ్యతిరేకంగా జాధవ్ కుటుంబం అప్పీలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
అప్పిలేట్ కోర్టు తిరస్కరిస్తే ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించవచ్చు: పాక్
‘చట్టపరిధికి లోబడే జాదవ్‌పై విచారణ నిర్వహించాం’ అని పాకిస్తాన్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న సర్తాజ్ అజీజ్ అన్నారు. సైనిక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై 40 రోజుల్లోగా జాధవ్ మిలటరీ అప్పిలేట్ కోర్టును ఆశ్రయించవచ్చని.. ఒకవేళ ఆ విజ్ఞప్తిని అప్పిలేట్ కోర్టు తిరస్కరిస్తే... మరో 60 రోజుల్లోగా ఆర్మీ చీఫ్‌కు అప్పీలు చేసుకోవచ్చన్నారు.
ఆర్మీ చీఫ్ తిరస్కరిస్తే పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవచ్చన్నారు. ఎవిడెన్స్ యాక్ట్ తో సహా సంబంధిత చట్టాలకు లోబడే సుధీర్ఘ విచారణ నిర్వహించామని, మేజిస్ట్రేట్ ముందు స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేశారన్నారు. తనను ముస్లింగా పేర్కొంటూ నకిలీ గుర్తింపుపత్రాన్ని జాధవ్ ఎందుకు వాడాడని, ఒక అమాయక మనిషి ఎందుకు రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడని, ఒక పాస్‌పోర్ట్‌లో హిందూ పేరు, మరో దాంట్లో ముస్లిం పేరు ఎందుకున్నాయని ప్రశ్నించారు. కాగా కుల్‌భూషణ్ యాదవ్‌కు ఏ న్యాయవాదైనా సాయం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని లాహోర్ హైకోర్టు బార్ అసోషియేషన్ హెచ్చరించింది. వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని బార్ అసోషియేషన్ సెక్రటరీ జనరల్ అమెర్ సయీద్ పేర్కొన్నారు.