జాధవ్‌పై స్టేను విశ్లేషిస్తున్నాం
ఐసీజే మరణదండన నిలుపుదల ఉత్తర్వులపై పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: గూఢచర్యం కేసు లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పును విశ్లేషిస్తున్నట్లు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. కొద్దిరోజుల్లో దీనిపై ప్రకటన చేయనున్నట్లు పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తార్ అజీజ్ వెల్లడించారు. ఈ కేసులో భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను, స్టే విధించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న అధికారాన్ని విశ్లేషిస్తున్నా మన్నారు.
ఉత్తర్వుపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వాతో చర్చించారు. పాక్‌లో భారత్ ఎగదోస్తున్న ఉగ్రవాదం నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకు జాదవ్ మరణశిక్షను భారత్ ఉపయోగించుకుంటోందని, ఇందులో భాగంగానే అంతర్జాతీయ న్యాయస్థానానికి లేఖ రాసిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఇటీవల ట్వీట్ చేశారు. ఐసీజేలో భారత్ పిటిషన్ వేయడాన్ని పాక్ మీడియా విమర్శించింది.
ప్రాణహాని ఉన్నందుకే: పాక్‌లో అక్రమ నిర్బంధంలో ఉన్న జాధవ్‌కు ప్రాణహాని ఉన్నందుకే ఐసీజేను ఆశ్రయించామని, ఇది జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. కాగా, ఈ నెల 15న జాధవ్ కేసుపై బహిరంగ విచారణ జరుపుతామని ఐసీజే తెలిపింది.