ఇస్లామాబాద్: గూఢచర్యం కేసులో భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు తమ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా నిర్ణయించినట్లు సమా అనే పాక్ టీవీ చానల్ తెలిపింది. ఈ విషయంలో బజ్వా ప్రధానిని విశ్వాసంలోకి తీసుకున్నారని వెల్ల డించింది. జాధవ్‌కు శిక్షపై మండిపడ్డ భారత్ అసాధారణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో బజ్వా బుధవారం షరీఫ్‌తో సమావేశమయ్యారు.
ఆర్మీ సంసిద్ధత, దేశ భద్రత, సరిహద్దు పరిస్థితిపై వీరు చర్చించినట్లు పాక్ రేడియో తెలిపింది. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ‘రదుల్ ఫసద్’పై బజ్వా ప్రధానికి వివరించారని తెలిపింది. షరీఫ్‌తో బజ్వా భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని, అయితే ఆ దేశం ఇంతవరకు ఆ పనిచేయలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులను కోరుకుంటున్నామని ఆయన అన్నట్లు పాక్ అధికార మీడియా తెలిపింది.