qamar javed Bajwa
-
పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్‌కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్‌ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
ఎల్వోసీని సందర్శించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: సరిహద్దు దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దాయాది ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)ను సందర్శించారు. ఆయన వెంట రక్షణశాఖ మంత్రి పర్వేజ్ ఖటక్, విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, కశ్మీర్ మీద ఏర్పాటైన స్పెషల్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఫఖర్ ఇమామ్, ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ఉన్నారు. పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ ఎల్వోసీని సందర్శించారు. ఆర్మీ చీఫ్ బజ్వాతో కలిసి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సైనికులు, అమర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోనూ ఆయన పర్యటించారు. 1965లో భారత్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళిగా పాక్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. -
కశ్మీర్‌ను వదులుకునే ప్రసక్తే లేదు: పాక్
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుంది. భారత్‌తో సహా ప్రపంచ వేదికలపై కూడా దీనికి సంబంధించిన చర్చలు తగ్గిపోతున్నాయి. కానీ దాయాది దేశం మాత్రం పూటకోసారైనా దీని గురించి తల్చుకుంటూనే ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ పెద్ద తప్పు చేసింది.. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.. యుద్ధం తప్పదంటూ బీరాలు పలుకుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మరోసారి ఆర్టికల్ 370 రద్దుపై స్పందించాడు. త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగాడు. కశ్మీర్ లోయలో భారత్ విధ్వంసాలకు పాల్పడుతుందని.. హిందుత్వాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం బజ్వా పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ పాక్ ముఖ్య ఎజెండా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం సవాలుగా భావిస్తున్నాం. కశ్మీర్‌ను వదిలే ప్రసక్తే లేదు. మా ప్రతి సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బుల్లెట్, చివరి శ్వాస ఆగే వరకూ కశ్మీర్ కోసం పోరాడుతూనే ఉంటాడు. కశ్మీర్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే. ఈ రోజు కశ్మీర్లో హింస, విధ్వంసం పెరిగిపోతున్నాయి. మోదీ ప్రభుత్వం లోయలో బలవంతంగా హిందుత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. కశ్మీర్ ప్రజలకు మేం చెప్పేది ఒకటే.. మేం మీకు తోడుగా ఉన్నాం. మీకు భరోసా ఇస్తున్నాం. కశ్మీర్ కోసం యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాం’ అన్నాడు. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి నుంచి పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ సగటున రోజుకు 10 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దిగిందని వెల్లడైంది. పాక్ సైన్యం కవ్వింపు చర్యలతో ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలకు దారితీసి ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రేరేపిస్తోంది. అయితే పాక్ ఆగడాలను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి. మరోవైపు గుజరాత్ తీరంలోకి సముద్ర మార్గం ద్వారా పాక్ కమాండోలు, ఉగ్రవాదులు ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాల సమాచారంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. (చదవండి: అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!) -
‘బులెట్లతోనే సమాధానం చెప్పాలి ’
సాక్షి, ముంబై : బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శల వర్షం కురిపించింది. పాకిస్తాన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మోదీని ఘాటుగా ప్రశ్నించింది. సరిహద్దుల్లో ప్రాణాలు కొల్పోయిన పాక్ సైనికుల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఆర్మీ ఛీప్ ఖమర్ జావేద్ బజ్వా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. 56 అంగుళాల ఛాతి గల మోదీ దాయాది దేశం వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని.. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఆయన మాదీరిగానే పాక్ విషయంలో ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. భారత్-పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదంగా ఉన్న పాక్ కశ్మీర్ కశ్మీర్‌పై (పీవోకే) శాశ్వాత చర్యలు చేపడతామని 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ వాగ్ధానం చేశారని గుర్తుచేశారు. నాలుగున్నర ఏళ్ల బీజేపీ పాలనలో పాకిస్తాన్‌పై ప్రకటనలు తప్ప ఏమీ చేయలేదని రౌత్ విమర్శించారు. ఓవైపు పాకిస్తాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో శాంతి చర్చలు జరుపుతామని ప్రకటిస్తుంటే.. మరోవైపు ఆర్మీ ఛీప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్ తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. పాక్‌కు మాటలతో కాదని.. బులెట్లతోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. -
ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్ చెరలో ఉన్న కశ్మీర్‌కు విముక్తి కలిగిస్తామంటూ ప్రగల్భాలు పలికింది. ఓవైపు.. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతుంటే... మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా మాత్రం భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ రక్షణ రంగం వెబ్సైట్ కథనం ప్రకారం... ‘ భారత్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడుతున్నారు. వారికి విముక్తి కలిగించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. కశ్మీర్‌లోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాలకు సలాం చేస్తున్నా. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సైనికుల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం’ అంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి స్పష్టంగా అర్థమైందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘భారత్‌తో సంబంధాలను బాగుచేయండి’
లాహోర్ : భారతదేశంతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి ప్రభుత్వ తీసుకు రావాలని.. ఆయన పార్లమెంట్ సెనెట్ కమిటీ ముందు తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకునే ఈ చొరవను సైన్యం అభినందించడంతో పాటు, అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత్ సహా ఇతర పొరుగు దేశాలతోనూ పాకిస్తాన్ తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సెనెట్ కమిటీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అభద్రతలోకి నెట్టివేయడంతో పాటు, అస్థిరపరిచేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ బజ్వాతో పాటు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స చీఫ్ నవీద్ ముఖ్తార్, మేజర్ జనరల్ సాహిర్ సంషాద్ మీర్జాచ మరో మేజర్ జనరల్ ఆషిమ్ మునీర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పొరుగు దేశం భారత్‌తో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో భారత్ దుందుడుకు చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని అన్నారు. -
పాకిస్తానీల నమ్మకం.. ‘హఫీజ్ సయీద్’
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను సమర్థించే వారి సంఖ్య పాకిస్తాన్లో క్రమక్రమంగా పెరుగుతోంది. హఫీజ్ సయీద్‌కు నేనో పెద్ద అభిమానినంటూ పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా జాబితాలోకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా చేరారు. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను హఫీజ్ సయీద్ మాత్రమే పరిష్కరించగలరని ప్రతి పాకిస్తానీలు విశ్వసిస్తున్నాడంటూ.. జావేద్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ దేశం కోసం పోరాటం చేస్తున్నాడని జావేద్ కీర్తించారు. అంతేకాక కశ్మీర్ అంశంలో సయీద్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పారు. హఫీజ్ సయీద్ మాత్రమే కశ్మీర్‌కు విముక్తి ప్రసాదిస్తాడని పాకిస్తానీలంతా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
‘ఈ ఒక్క నగరం బాగుంటే పాక్ బాగున్నట్లే’
కరాచీ: పాకిస్థాన్ ప్రశాంతంగా ఉంటే ముందు కరాచీ శాంతంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. పాక్‌లో సుస్థిరత్వం నెలకొనాలన్నా, శాంతియుత పరిస్థితులు ఏర్పడాలన్న కరాచీనే కీలకం అని ఆయన చెప్పారు. ఆదివారం కరాచీలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన ఆయన కరాచీలో ప్రస్తుతం భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అలాగే, సాంఘిక వ్యతిరేక శక్తులను ఏరివేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న రద్దుల్ ఫసద్ ఆపరేషన్ గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగా కరాచీలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు సహకరిస్తున్న పాక్ రేంజర్లకు, ఆర్మీకి ధన్యవాదాలు చెప్పారు. కరాచీలో పూర్తిగా సాధారణ పరిస్ధితులు వచ్చే వరకు ఇలాగే పనిచేయాలంటూ సూచించారు. కరాచీ ద్వారానే పాక్‌లో సుస్థిరత సాధించేందుకు వీలవుతుందని మరోసారి స్పష్టం చేశారు. -
జాధవ్‌కు శిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గం: పాక్
ఇస్లామాబాద్: గూఢచర్యం కేసులో భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు తమ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా నిర్ణయించినట్లు సమా అనే పాక్ టీవీ చానల్ తెలిపింది. ఈ విషయంలో బజ్వా ప్రధానిని విశ్వాసంలోకి తీసుకున్నారని వెల్ల డించింది. జాధవ్‌కు శిక్షపై మండిపడ్డ భారత్ అసాధారణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో బజ్వా బుధవారం షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఆర్మీ సంసిద్ధత, దేశ భద్రత, సరిహద్దు పరిస్థితిపై వీరు చర్చించినట్లు పాక్ రేడియో తెలిపింది. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ‘రదుల్ ఫసద్’పై బజ్వా ప్రధానికి వివరించారని తెలిపింది. షరీఫ్‌తో బజ్వా భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని, అయితే ఆ దేశం ఇంతవరకు ఆ పనిచేయలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులను కోరుకుంటున్నామని ఆయన అన్నట్లు పాక్ అధికార మీడియా తెలిపింది. -
జాధవ్ ఉరిశిక్షపై పాక్ కీలక నిర్ణయం
ఇస్లామాబాద్: భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఉరిశిక్ష అంశంలో ఎటువంటి ఒత్తిడిలకు తలొగ్గరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. కుల్‌భూషణ్ కు ఉరిశిక్ష అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాతో భేటీ అయ్యారు. జాదవ్ ఉరిశిక్ష విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగరాదని వీరిరువురు నిర్ణయించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణలతో జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడంతో రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొంటామని నవాజ్ షరీఫ ప్రతిస్పందించారు. -
పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్!
పాకిస్తాన్ : రహేల్ షరీఫ్ తదుపరి పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శనివారం ప్రకటించారు. రహేల్ షరీఫ్‌ను నుంచి ఆయన 16 వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రహేల్ షరీఫ్ పదవీ కాలం నవంబర్ 29తో ముగియనుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉడి ఉగ్రఘటన అనంతరం జరిగిన ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిణామాలతో పాకిస్తాన్ తన ఆర్మీ చీఫ్‌ను మార్చకపోవచ్చని పలు ఊహాగానాలు వచ్చాయి. ఒకవేళ ఆర్మీ చీఫ్‌గా కొత్తవారిని నియమిస్తే వారు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పలువురు పేర్కొన్నారు. రహేల్ షరీఫ్ కూడా పాక్ ఆర్మీగా కొనసాగేందుకు మొగ్గుచూపకపోవడంతో పాటు ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో కొత్త ఆర్మీ చీఫ్‌ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.