జాధవ్ ఉరిశిక్షపై పాక్ కీలక నిర్ణయం
ఇస్లామాబాద్: భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఉరిశిక్ష అంశంలో ఎటువంటి ఒత్తిడిలకు తలొగ్గరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. కుల్‌భూషణ్ కు ఉరిశిక్ష అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాతో భేటీ అయ్యారు. జాదవ్ ఉరిశిక్ష విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగరాదని వీరిరువురు నిర్ణయించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
గూఢచర్యం ఆరోపణలతో జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడంతో రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొంటామని నవాజ్ షరీఫ ప్రతిస్పందించారు.