
ఇస్లామాబాద్: సరిహద్దు దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దాయాది ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ)ను సందర్శించారు. ఆయన వెంట రక్షణశాఖ మంత్రి పర్వేజ్ ఖటక్, విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, కశ్మీర్ మీద ఏర్పాటైన స్పెషల్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఫఖర్ ఇమామ్, ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ఉన్నారు.
పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ ఎల్‌వోసీని సందర్శించారు. ఆర్మీ చీఫ్ బజ్వాతో కలిసి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సైనికులు, అమర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోనూ ఆయన పర్యటించారు. 1965లో భారత్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళిగా పాక్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.