
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుంది. భారత్‌తో సహా ప్రపంచ వేదికలపై కూడా దీనికి సంబంధించిన చర్చలు తగ్గిపోతున్నాయి. కానీ దాయాది దేశం మాత్రం పూటకోసారైనా దీని గురించి తల్చుకుంటూనే ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ పెద్ద తప్పు చేసింది.. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.. యుద్ధం తప్పదంటూ బీరాలు పలుకుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మరోసారి ఆర్టికల్ 370 రద్దుపై స్పందించాడు. త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగాడు. కశ్మీర్ లోయలో భారత్ విధ్వంసాలకు పాల్పడుతుందని.. హిందుత్వాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించాడు.
ఈ మేరకు శుక్రవారం బజ్వా పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ పాక్ ముఖ్య ఎజెండా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం సవాలుగా భావిస్తున్నాం. కశ్మీర్‌ను వదిలే ప్రసక్తే లేదు. మా ప్రతి సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బుల్లెట్, చివరి శ్వాస ఆగే వరకూ కశ్మీర్ కోసం పోరాడుతూనే ఉంటాడు. కశ్మీర్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే. ఈ రోజు కశ్మీర్‌లో హింస, విధ్వంసం పెరిగిపోతున్నాయి. మోదీ ప్రభుత్వం లోయలో బలవంతంగా హిందుత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. కశ్మీర్ ప్రజలకు మేం చెప్పేది ఒకటే.. మేం మీకు తోడుగా ఉన్నాం. మీకు భరోసా ఇస్తున్నాం. కశ్మీర్ కోసం యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాం’ అన్నాడు.
జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి నుంచి పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ సగటున రోజుకు 10 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దిగిందని వెల్లడైంది. పాక్ సైన్యం కవ్వింపు చర్యలతో ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలకు దారితీసి ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రేరేపిస్తోంది. అయితే పాక్ ఆగడాలను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి. మరోవైపు గుజరాత్ తీరంలోకి సముద్ర మార్గం ద్వారా పాక్ కమాండోలు, ఉగ్రవాదులు ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాల సమాచారంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
(చదవండి: అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!)
Comments
Please login to add a commentAdd a comment