
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్కు ఉరిశిక్ష విధించారు. శుక్రవారం ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో చంద్రభాన్కు శిక్ష ఖరారుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు.