anuhya murder case
-
ఆ కిరాతకుడికి ఉరే సరి..
సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్: రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూహ్యపై ముంబైలో జరిగిన అత్యాచారం, దారుణ హత్య కేసు విషయంలో నిందితుడికి ఉరి శిక్షను సమర్థిస్తూ గురువారం బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అత్యంత దారుణమైన ఈ కేసులో నిందితుడిపై ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడికి మరణ శిక్ష సరైందేనని పేర్కొంది. దీంతో న్యాయం కోసం నాలుగేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అనూహ్య తండ్రి, కుటుంబ సభ్యులు తీర్పును స్వాగతించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేరు అనూహ్య (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. 2013 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య నూతన సంవత్సర వేడుకలు సైతం తల్లితండ్రులు, చెల్లితో కలసి ఆనందంగా జరుపుకుంది. అనంతరం 2014 జనవరి 5న ఉద్యోగరీత్యా ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యింది. మరుసటి రోజు అనూహ్య ముంబైలోని తన హాస్టల్‌కు చేరుకోకపోవడంతో, విషయం తెలుసుకున్న తండ్రి అక్కడ తమ బంధువులకు విషయం చెప్పాడు. పలు చోట్ల బంధువులు గాలింపు చేపట్టినా, ఫలితం లేకపోవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరం మొత్తం జల్లెడ పట్టారు. అనూహ్య సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించడంతో జనవరి 16న ముంబై– పూణే హైవే పక్కన ఉన్న పొదల్లో కాలి బూడిదైన అనూహ్య మృతదేహం కనిపించింది. పట్టించిన సీసీ కెమెరాలు అనూహ్య హత్యకేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. రైల్వేస్టేçషన్లో లభ్యమైన సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో ముంబైకి చెందిన పాత నేరçస్తుడు చంద్రభానుసనాప్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జాప్యం నెలకొనడంతో అనూహ్య తండ్రి జోనాథన్ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక వినతిపై కేంద్ర హోం మంత్రిని ఆశ్రయించాడు. దీంతో స్పందించిన ఆయన మహారాష్ట్ర హోం మంత్రికి కేసును సిఫార్సు చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ రాసి పంపారు. అక్కడి నుంచి అనూహ్య హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది. విచారణ పూర్తి చేసిన ముంబై పోలీసులు 2015 డిసెంబర్లో హంతకుడు చంద్రభాను సనాప్‌ను సెషన్స్ కోర్టులో పక్కా సాక్ష్యాధారాలతో హాజరుపరచగా కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ.. హంతకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గురువారం చంద్రభాను సనాప్‌కు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
‘తీర్పు ఆలస్యమైనా సరే ఇప్పుడు కాస్త తృప్తిగా ఉంది’
సాక్షి, ముంబై : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం, హత్య కేసులో బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన చంద్రబాన్‌కు కింది కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. సాయం చేస్తానని నమ్మించి, అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షే సరైందని కోర్టు అభిప్రాయపడింది. కాగా నాలుగేళ్ల క్రితం మచిలీపట్నానికి చెందిన టెకీ ఎస్తర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు స్వస్థలానికి వచ్చిన అనూహ్య జనవరి 4, 2014న ముంబైకి తిరుగు ప్రయాణమైంది. అయితే మరుసటి రోజు ఉదయం వరకు ఆమె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనూహ్య అదృశ్యంపై విచారణ చేపట్టిన పోలీసులకు జనవరి 16న ముంబై- థాణే ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కుంజూరుమార్గ్ ప్రాంతంలో పొదల్లో ఆమె మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ముంబై రైల్వేస్టేషన్లో అనూహ్య రైలు దిగినప్పటి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు రైల్వే దొంగ చంద్రబాన్‌ను హంతకుడిగా నిర్ధారించి... మే 26న 542 పేజీలున్న చార్జీషీటును దాఖలు చేశారు. 76 మంది సాక్షులను విచారించి సంబంధిత ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అక్టోబరు 27, 2015 కోర్టు చంద్రబాన్‌ను దోషిగా నిర్థారించిన న్యాయస్థానం... అక్టోబరు 30న అతడికి మరణశిక్ష విధించింది. (అనూహ్య హత్య కేసు : అసలేం జరిగింది.. నిందితుడెలా పట్టుబడ్డాడు) సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే కృష్ణా : తన కుమార్తె హత్య కేసులో ముంబై ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని టెకీ అనూహ్య తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నిందితుడు చంద్రబాన్‌కు ఉరిశిక్షే సరైందని, ఆడపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించే వారికి ఈ శిక్ష గుణపాఠం కావాలని ఆకాంక్షించారు. తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఇప్పుడు తనకు సంతృప్తిగా వుందని తెలిపారు. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇదే శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు. -
అనూహ్య హత్యకేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
-
గోవధకిస్తున్న ప్రాధాన్యత మహిళలకివ్వడం లేదు
-
అనూహ్య కేసులో న్యాయం
దేశంలో ఆడవాళ్లపై అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆందోళనపడుతున్నవారికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో నేరగాడికి ముంబై ప్రత్యేక సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం వెలువరించిన తీర్పు ఉపశమనం కలిగిస్తుంది. ముంబై శివారులో ఉన్న టీసీఎస్‌లో ఉద్యోగిని అయిన అనూహ్య... సెలవులకు స్వస్థలమైన కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చి తిరిగి వెళ్తూ నిరుడు జనవరి 5న కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్నుంచి అదృశ్యం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కన్నవారు తల్లడిల్లారు. చివరకు 55 రోజుల తర్వాత ఆమె మృతదేహం నిర్జన ప్రదేశంలో లభ్యమైంది. 2,500 మందిని విచారించి, 36 సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు చివరకు చంద్రభాన్ సానాప్ హంతకుడన్న నిర్ణయానికొచ్చారు. మూడేళ్లక్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం తర్వాత కఠినమైన చట్టం అమల్లోకి వచ్చినా, ఆ మాదిరి ఉదంతాల్లో తగ్గుదల కనిపించకపోవడం సమాజంలో అందరినీ కలవరపెడుతున్నది. ఇప్పుడు అనూహ్య హత్య కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది. మహిళలపై జరిగే నేరాల విషయంలో అలసత్వం వహించడంవల్లే అవి పదే పదే జరుగుతున్నాయని మహిళా సంఘాలు ఆరోపిస్తాయి. వెనువెంటనే దర్యాప్తు జరిపి నేరాన్ని రుజువు చేయగలిగితే...సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేటట్లు చేయగలిగితే ఇలాంటి నేరాలు నియంత్రణలోకొస్తాయని ఆ సంఘాలు అంటాయి. దాంతోపాటు సమాజంలో మానవీయ విలువల్ని పెంపొందించడం, మహిళలను కించపరిచే ఆలోచనా ధోరణులను రూపుమాపడం అవసరమని చెబుతాయి. దురదృష్టవశాత్తూ అవేమీ జరగడంలేదు. మీడియాలో విస్తృత ప్రచారం పొందిన కొన్ని కేసులు మినహా...మిగిలినవి నత్తనడకన సాగుతున్నాయి. డబ్బూ, పలుకుబడీ ఉన్నవారు నిందితులైన పక్షంలో కేసుల నమోదే అసాధ్యమవుతున్నది. కొన్నేళ్లక్రితం సినీ నటి ప్రత్యూష మరణం కేసులో ఏమైందో అందరికీ తెలుసు. ప్రలోభాలకు, ఇతర ఒత్తిళ్లకు లొంగి దర్యాప్తు సక్రమంగా జరపకపోవడంవల్లనే తన కుమార్తెకు న్యాయం జరగలేదని అప్పట్లో ఆమె తల్లి ఆరోపించారు. మన దేశంలో నిరుడు 3 లక్షల 38వేల లైంగిక నేరాలు నమోదయ్యాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు సంవత్సరం కన్నా ఇది 9 శాతం ఎక్కువ. అనూహ్య కేసు విషయంలో పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు జరిపారు. అత్యాచారానికి ప్రయత్నించి, ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో హతమార్చాడని రుజువు చేశారు. న్యాయస్థానంలో కూడా విచారణ వేగంగా జరిగింది. కానీ ఇదంతా సవ్యంగా సాగడానికి అనూహ్య తల్లిదండ్రులూ, అయినవారూ ఎంత కష్టపడ్డారో...సమాజంలోని భిన్న వర్గాలవారు ఏ రకంగా ఒత్తిళ్లు తెచ్చారో గుర్తుంచుకోవడం అవసరం. అసలు కేసు నమోదు చేసుకోవడానికే పోలీసులు ముందుకు రాలేదు. మా పరిధిలోకి రాదంటే...మా పరిధిలోకి రాదంటూ తప్పించుకోవాలని చూశారు. అనూహ్య అదృశ్యమైన రోజే ముంబైలోని ఆమె బంధువు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె తండ్రి విజయవాడ పోలీసులను ఆశ్రయించడం, వారు కుర్లా పోలీస్ స్టేషన్‌కు లేఖ పంపడం పర్యవసానంగా కేసు నమోదైంది. ఇంత జాప్యం చోటు చేసుకుంటే కన్నవారు ఎంత క్షోభకూ, మానసిక వేదనకూ గురవుతారో వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడో తమ బిడ్డ ఇంకా క్షేమంగా ఉండి ఉండొచ్చని...పోలీసులు వెంటనే కదిలితే ఆమె సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుందని వారు ఆశిస్తారు. అనూహ్య మృతదేహం ఆచూకీ కనుగొన్నది కూడా ఆమె బంధువులే తప్ప పోలీసులు కాదు. వీటన్నిటినీ లోక్‌సభలో ప్రస్తావించడం, కేసు సక్రమంగా దర్యాప్తు చేసేలా చూడమని అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరడం...మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడటం వంటి కారణాలవల్ల పోలీసులు కదిలారు. దానికితోడు బొంబాయి హైకోర్టు కూడా ఈ విషయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ యువతి అదృశ్యమైందని ఫిర్యాదు వస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ చీవాట్లు పెట్టింది. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతల్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు వ్యవస్థ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎంతమంది ఎన్ని విధాలుగా శ్రమించవలసి వచ్చిందో అనూహ్య ఉదంతం చూస్తే అర్థమవుతుంది. నిజానికి అన్ని కేసులూ ఇలా త్వరితగతిన పూర్తయితే నేర మనస్తత్వం ఉండేవారిలో భయం ఏర్పడుతుంది. నేరం చేస్తే తప్పించుకోవడం సాధ్యంకాదని అర్ధమవుతుంది. సమాజంలో నేర నియంత్రణకు అదెంతగానో తోడ్పడుతుంది. ఈమధ్యే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒక కేసులో తీర్పునిస్తూ నేరస్తులకు మగతనాన్ని తొలగించే విధంగా నేర శిక్షాస్మృతిలో నిబంధనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. మరణశిక్ష అయినా, మగతనాన్ని తొలగించే శిక్షయినా అత్యాచారాలను అరికట్టగలవనుకోవడం సరైంది కాదని మానవ హక్కుల సంఘాలు వాదిస్తాయి. దోషులను దండించడం, చట్టమంటే అందరిలోనూ భయం కలిగేలా చేయడం అవసరమే. దాన్నెవరూ కాదనరు. కానీ నేరాలకు దోహదం చేస్తున్న ధోరణులనూ, పరిస్థితులనూ పెకిలించకుండా... అందుకవసరమైన చైతన్యాన్ని పెంచకుండా నేరాలను అరికట్టగలమా? ఈ విషయంలో జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని కమిటీ ఎన్నో సూచనలు ఇచ్చింది. అలాంటి సూచనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే లైంగిక నేరాలకు అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుంది. -
'ఉరి శిక్ష విధిస్తారని అనుకోలేదు'
ముంబయి: ఉరి శిక్ష విధిస్తారని తాను అస్సలు ఊహించలేదని అనూహ్యపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన నేరస్తుడు చంద్రభాన్ అన్నాడు. తాను అసలు ఎలాంటి నేరం చేయలేదని అనవసరంగా తనపై ఈ నేరాన్ని రుద్దుతున్నారని చెప్పాడు. కోర్టు తీర్పు వినగానే కోర్టు హాల్లోనే కూలబడ్డ చంద్రభాన్ సనాప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అనూహ్యపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంద్రభాన్ హత్య చేసినట్లు కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో 2012నాటి ఢిల్లీ అత్యాచారానికి సంబంధించిన స్పందనే వచ్చిందని కోర్టు తెలిపింది. మహిళలకు సురక్షితంగా ఉన్న ముంబై ప్రతిష్టను ఈ నేరం దెబ్బతీసిందని కూడా కోర్టు పేర్కొంది. అతడు అరుదై నేరం చేశాడని, అందుకే ఉరి శిక్ష విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఓ సంకేతం కావాలని, గట్టి హెచ్చరిక గా ఉంటుందని పేర్కొంది. -
ఉరిశిక్షే సరియైనది ..
-
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
-
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
అనూహ్య హత్యకేసులో దోషిగా తేలిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఈ నిర్ణయం నేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోంది ఈ కేసు విషయంలో మాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు నాకెందుకో అతడి మీద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది ఆమె రెండో ప్లాట్ఫారం మీద దిగి, నాలుగో ప్లాట్ ఫారం మీదకు వచ్చింది ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు మీద తీసుకెళ్లాడు బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో తను చాలా సెన్సెటివ్‌గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా ఉంది ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు కూడా భయపడాలి టీజింగ్ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారు అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి చంద్రభాన్ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నాను అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగింది. -
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
-
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్కు ఉరిశిక్ష విధించారు. శుక్రవారం ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్‌ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో చంద్రభాన్కు శిక్ష ఖరారుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'
ముంబై: తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే దాదాపు 80 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ముంబై కోర్టు చంద్రభాన్‌ను దోషీగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'
-
అనూహ్య హత్య కేసు: చంద్రభాన్ దోషిగా నిర్ధారణ
మచిలీపట్నం నుంచి వెళ్తూ.. ముంబైలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో నిందితుడు చంద్రభాన్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అతడికి శిక్షను బుధవారం ఖరారు చేస్తారు. ముంబైలో టీసీఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసే అనూహ్య.. తన తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్ జరుపుకోడానికి తమ సొంతూరు కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చింది. తిరిగి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అదృశ్యమైంది. ఎల్టీటీ స్టేషన్లో రైలు దిగిన ఆమెకు టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేసి హతమార్చాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ కేసు విచారణ సాగుతోంది. 1300 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. చివరకు నిందితుడు చంద్రభాన్‌ను దోషిగా నిర్ధారించారు. రేపు శిక్ష ఖరారు చేస్తారు. అతడికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. చంద్రభాన్.. అత్యాచారం, హత్య చేసినట్లుగా కోర్టు తేల్చింది అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్, దుస్తులు, ఐడీ కార్డు తదితరుల వస్తువుల ఆచూకీని పోలీసులు గుర్తించగలిగారు. వాటిలో లభించిన డీఎన్ఏ నమూనాల ద్వారా నిందితుడు చంద్రభాన్ అని నిర్ధారించారు. సొంతూరు మచిలీపట్నం నుంచి 2014 జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. కుళ్లిపోయిన ఈమె మృతదేహం అదే నెల16వ తేదీన భాండుప్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో దొరికింది. -
అనూహ్య కేసులో కీలక మలుపు
సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసుపై ఎట్టకేలకు చార్జిషీట్ దాఖల యింది. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ ధాతే ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడిని అరెస్టు చేశామన్నారు. లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 76 మంది సాక్షులున్నట్టు చెప్పారు. ప్రధాన నిందితుడు చంద్రభాన్ సానప్ ఎలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కళ్లద్దాలు, ఐడీ కార్డుతో సరిపోలిన డీఎన్ఏ... కేసు దర్యాప్తునకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుంచి దొంగి లించిన బ్యాగ్, దుస్తులు, ఐడీకార్డు తదితరుల వస్తువుల్లో లభించిన డీఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి సేకరించిన అనూహ్య కళ్లద్దాలు, ఐడీ కార్డు నుంచి లభించిన డీఎన్ఏ అనూహ్య డీఎన్ఏతో సరిపోలింది. ఏసీపీ ప్రఫుల్ మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ‘డీఎన్ఏతోపాటు అనేక ఆధారాలను సేకరించాం. 76 మంది సాక్షులనూ ప్రశ్నించాం. ఈ ప్రక్రియ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశాం. అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో అనేక ఆధారాలకు నష్టం వాటిల్లింది. అయినా శ్రమించి చంద్రభానును పట్టుకోవడంతోపాటు పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాం. అనూహ్యను మోట ర్సైకిల్పై తీసుకెళ్తుండగా కూడా చూసిన ప్రత్యక్ష సాక్షులనూ గుర్తించాం. వీరితోపాటు అనేక మందిని విచారించాం. అనంతరం నిర్వహించిన పరేడ్‌లో కూడా నిందితున్ని సాక్షులు గుర్తుపట్టారు’ అని ఆయన వివరించారు. అత్యచారం జరిగింది...! అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం వైద్యపరీక్షల్లో తేలలేదు. అత్యాచారం జరిగినట్టు తమ దర్యాప్తులో తేలిందని ప్రఫుల్ బోస్లే పేర్కొన్నారు. దీంతో నిందితునిపై 302, 364, 366, 376(2)(ఎస్), 376ఎ, 397, 210, 170 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లభించని ల్యాప్‌ట్యాప్... అనూహ్య వస్తువుల్లో కీలకమైన ల్యాప్‌టాప్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీనికోసం ఇప్పటికీ గాలిస్తున్నామని ప్రఫుల్ తెలిపారు. దానిని ఆంబివలి, షాహాడ్ సమీపంలోని క్రీక్నదీలో పడేసినట్టు నిందితుడు పేర్కొన్నాడు. దీంతో గజ ఈతగాళ్ల సహకారంతో ల్యాప్‌టాప్ కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ ప్రఫుల్ నేతృత్వంలోని 20 మంది అధికారులు, 85 మంది పోలీసుల బృందాలు పరిసరాలను జల్లెడపట్టాయి. అయినప్పటికీ ల్యాప్‌టాప్ ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే అనూహ్య కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్ రాజన్ ఠాక్రేను ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా నియమించాలని కోరినట్టు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ దాతే తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్వగ్రామం నుంచి జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదయింది. కుళ్లిపోయిన ఈమ మృతదేహం 16న భాండుప్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో దొరికింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె ముంబై టీసీఎస్‌లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసేది. -
అనూహ్య హత్యకేసు వివరాలు వెల్లడి
ముంబై: సంచలనం సృష్టించిన సాప్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసు వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా ఈరోజు వెల్లడించారు. విజయవాడ నుంచి జనవరి 4న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన అనూహ్య 5వ తేదీన ముంబైలో రైలు దిగి అదృశ్యమై, ఆ తరువాత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాసిక్‌కు చెందిన చంద్రభాన్ సాసప్ను పోలీసులు అరెస్ట్ చేసి ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 15 వరకు నిందితుడికి పోలీస్ కస్టడి విధించింది. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కథనం ప్రకారం చంద్రభాన్ ఓ రైల్వే కూలీ కుమారుడు. తండ్రి మరణం తరువాత అతని లైసెన్సును తన పేరుపై మార్చుకొని కొంత కాలం రైల్వే కూలీగా పని చేశాడు. ఆ తరువాత అతను కొంతకాలం కాల్ సెంటర్లకు క్యాబ్ డ్రైవర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను తన మూడవ భార్యతో నాసిక్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ట్రాన్స్పోర్ట్స్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. చంద్రభాన్కు రైల్వేస్టేషన్లో బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగిలించే అలవాటు ఉంది. అమ్మాయిలను వేధించే అలవాటు కూడా అతనికి ఉంది. అతనిపై ముంబై, మన్మాడ్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. 5వ తేదీ ఉదయం తన మిత్రులతో కలసి ముంబై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అనూహ్య అతని కంటపడింది. 300 రూపాయలు ఇస్తే ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. ఆమె బయటకు వచ్చేసరికి అతను మోటార్ బైకు తెచ్చాడు. దాంతో ఆమె వెనకాడింది. అయితే ఆమెకు అతను నచ్చజెప్పాడు. తన బైకు నంబర్, సెల్ నంబర్ నోట్ చేసుకోమని చెప్పాడు. అనూహ్య అమాయకంగా నమ్మి బైకు ఎక్కి వెళ్లింది. ఆమెను తిలక్ నగర్ వైపు తీసుకువెళ్లాడు. ఆ తరువాత బైకులో పెట్రోల్ అయిపోయిందని బైకును నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అనూహ్య ప్రతిఘటించింది. దాంతో ఆమెను చావబాది హత్య చేశాడు. -
ఎటూ తేలని దర్యాప్తు
అనూహ్య హత్య కేసులో స్థానికుల సహకారం తీసుకోవాలని పోలీసుల యోచన ఇప్పటివరకు సాధించింది శూన్యం మృతురాలి తల్లిదండ్రులతో కొత్త కమిషనర్ భేటీ త్వరలోనే కేసును ఛేదిస్తామని హామీ సాక్షి, ముంబై: ఇటీవల సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు స్థానికుల సాయం తీసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఈ కేసుపై ఆమెతో ప్రయాణించిన ప్రయాణికులను, ఆటో, ట్యాక్సీ, రైల్వే సిబ్బందిని విచారించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. చివరకు చేసేదిలేక పోలీసులు మృతదేహం లభించిన ప్రాంతం, లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ ప్రాంతాల్లో స్థానికుల సహకారంతో ముందుకెళ్లాలని తుది నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని వారు భావిస్తున్నారు. కుర్లా టర్మినస్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఫొటోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాని ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. బహుశా భయపడి సమాచారం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుడి ఆచూకీ ధైర్యంగా తెలియజేసేందుకు 9870205499, 9869028394, 022-25783999, 022-25963003 ఫొన్ నంబర్లను విడుదల చేశారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే నిర్భయంగా ఈ నంబర్లను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. నిందితుడి గురించి తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. జనవరి నాలుగో తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరిన అనూహ్య ఐదో తేదీన తెల్లవారుజామున కుర్లా టర్మినస్‌లో రైలు దిగింది. ఆ తర్వాత అదృశ్యమైన ఆమె కాంజూర్‌మార్గ్ ప్రాంతంలో జనవరి 15న శవమై కనిపించిన విషయం తెలసిందే. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో ఈ హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. కాని పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను బట్టి అనుమానిత వ్యక్తి జీన్ ప్యాంట్ జేబుకు వేలాడుతున్న తాళాల గుత్తిని బట్టి అతడు డ్రైవర్ కావచ్చని అనుమానిస్తున్నారు. అతడు మద్యం మత్తులో తూలుతున్నట్లు కదలికలను బట్టి గుర్తించారు. అతడి చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉండడంతో అందులో మద్యం ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. టెర్మినస్‌లో రైల్వే సిబ్బందితో కొద్ది సేపు మాట్లాడుతున్నట్లు కెమెరాలో కనిపించింది. సిబ్బందిని విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో ఇక సాధారణ జనం సహకారంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదిలాఉండగా ఇటీవల నగర పోలీసు కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాకేశ్ మారియా అనూహ్య కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. వారిని ఓదార్చి హంతకులను సాధ్యమైనంత త్వరగా పట్టుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకు చేపట్టిన దర్యాప్తు ఫైలు, పురోగతి వివరాలు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. -
అనూహ్య మలుపులు
-
అనూహ్య హత్యకు నిరసనగా హైదరాబాద్‌లో పాస్టర్ల ధర్నా
హైదరాబాద్: అనూహ్య హత్యకు నిరసనగా శుక్రవారం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ బైబిల్ హౌస్ నుంచి ఇందిరాపార్కు వరకూ శాంతి ర్యాలీ చేపట్టారు. ధర్నాలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నట్లు సీబీఐ విచారణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ స్వరణ్‌జిత్ సేన్, సీఎస్ఐ మోడరేటర్ దైవాశ్వీరాదం, ఆర్చ్ బిషప్ తుమ్మ బాల, ఫాదర్ బాలా, మెదక్ డయాసిస్ వైస్ ఛైర్మన్ ఏసీ సాల్మన్ రాజు, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, వివిధ క్రిస్టియన్ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. -
అనూహ్యతో ఆరోజు ఉన్నదెవరు?
-
మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్‌మార్గ్‌కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు. అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. -
అనూహ్య హత్య కేసు
సాక్షి, ముంబై: అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో.... పోలీసులతోపాటు అందరు ఎదురుచూస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ మరో రెండు మూడు రోజుల్లో వచ్చేఅవకాశాలున్నాయి. దీని గురించి ముంబై కలీనాలోని ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీస్’ డెరైక్టర్ డాక్టర్ ఎంకె మాల్వే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు ఫోరెన్సిక్ నివేదిక ఇంకా తయారుకాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక అందే అవకాశముందని తెలిపారు. దర్యాప్తులో కనిపించని పురోగతి... నగరంలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు అదుపులోకి తీసుకున్నారని చెప్పిన నిందితులనుంచి కూడా పెద్దగా ఆధారాలేవీ లభించకపోవడంతోవారిని కూడా విడిచిపెట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. -
‘అనూహ్య’కు న్యాయం చేయాలి
సాక్షి, ముంబై: ముంబైలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. తెలుగు సంఘాలతోపాటు అనేక సంఘాలు ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలతోపాటు హోంశాఖ మంత్రి, ఇతర రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు వినతి పత్రాలను అందిస్తున్నారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులందరు ఒక్కటిగా ఏర్పడి అనూహ్య కోసం ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవలే ఆజాద్‌మైదానంలో ఆందోళ న చేసిన వీరు ఆదివారం గోపీనాథ్ ముండేతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేశారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్ఆర్సీపీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యకు ఎల్టీటీ ఆవరణలో శ్రద్దాంజలి ఘటించారు. అనూహ్యను హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చూస్తాం: గోపీనాథ్ ముండే హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తానని లోక్‌సభ ఉప ప్రతిపక్ష నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్సార్సీపి నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల బృందం సభ్యులు ఆదివారం సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేను కలిశారు. ఈ సందర్బంగా అనూహ్య కనిపించకుండా పోయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు తీరును వివరించారు. దీనిపై స్పందించిన ఆయన అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముండేతో భేటీ అనంతరం మాదిరెడ్డి కొండారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞాపనకు ముండే సానుకూలంగా స్పందించారన్నారు. నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్‌కు ఫోన్ చేసి కేసు వివరాలను తెలుసున్నారన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలతో హైద రాబాద్తోపాటు వివిధ ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయని, రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశముందని చెప్పినట్లు కొండారెడ్డి తెలిపారు. ఇది ఒక్క తెలుగు అమ్మాయి ఎస్తేర్ అనూహ్య అనే కాకుండా, ఇది మహిళలందరి భద్రత అంశంగా ముండే పేర్కొన్నారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీతోపాటు పార్లమెంట్లో లేవనెత్తుతామని హామీని ఇచ్చారన్నారు. ముంబైలోని తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు అనూహ్యకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు తన మద్దతు ఉం టుందని ముండే చెప్పినట్టు కొండారెడ్డి చెప్పారు. ముండేతో భేటీ అయిన వారిలో ముంబై, నవీ ముంబై, ఠాణే, భివండీ చుట్టుపక్కలలోని వివిధ తెలుగు సంఘాలు ప్రతినిధులున్నారు. వీరిలో పోతు రాజారాం, వీరబత్తిని చంద్రశేఖర్, మంతెన రమేష్, మర్రి జనార్దన్, భోగ సహదేవ్, వాసాలా శ్రీహరి, యెల్ది సుదర్శన్, అనుమల్ల రమేష్, శెకెల్లి రాములు, బడుగు విశ్వనాథ్, కంటె అశోక్, మచ్చ ప్రభాకర్, గట్టు నర్సయ్య, విజయ, అనురాధ, కస్తూరి హరిప్రసాద్, బండి హర్యన్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, రవీ గౌడ్, గుంటుక కోటి రెడ్డి, వై వి నారాయణ రెడ్డి, ఎవి నాగేశ్వర్ రావ్, సంకు సుధాకర్, మార్గం రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో 'అనుహ్య' నిందితులు!
-
పోలీసుల అదుపులో 'అనుహ్య' నిందితులు!
ముంబైలో దారుణహత్యకు గురైన మచిలీపట్నం యువతి అనుహ్య కేసులో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. అనుహ్య కేసుకు సంబంధించి నలుగురు ఆటో డ్రైవర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు డ్రైవర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అనుహ్య పని చేస్తుంది. అయితే క్రిస్టమస్ సెలవులు నేపథ్యంలో అనుహ్య స్వస్థలం వచ్చింది. సెలవులనంతరం ఆమె ఈ నెల మొదటివారంలో ముంబై పయనమైంది. ఆ క్రమంలో అనుహ్య ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందారు. దాంతో ఆయన ముంబై వచ్చి అనుహ్య కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆయన ముంబై పోలీసులను ఆశ్రయించారు. వారిని నుంచి సరైన స్పందన లేకపోవడంతో హరిప్రసాద్ తన బంధువులతో గాలించారు. దీంతో నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయిన ఉన్న మృతదేహన్ని అనుహ్యగా గుర్తించారు. అనుహ్య మరణంపై ముంబై పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని ఆమె తండ్రి హరిప్రసాద్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలసి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయాలని మహారాష్ట్ర సీఎంకు షిండే ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
న్యాయం చేయండి: అనూహ్య తండ్రి
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: ముంబైలో దారుణహత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో మహారాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అనూహ్య తండ్రి ప్రసాద్ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి 15 రోజులు దాటిపోయినా నిందితులను గుర్తించలేదని.. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అయితే, ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందని అనంతరం మీడియా వద్ద ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజానా చౌదరి కలిసి ప్రసాద్‌ను వెంటపెట్టుకొని షిండేను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్ తన కూతురు హత్య కేసును నీరుగార్చేందుకు ముంబైకి చెందిన ఒక కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ దృష్ట్యా విచారణను సీబీఐకి అప్పగిస్తే తమకు న్యాయం జరుగుతుందని వేడుకున్నారు. దీనికి షిండే స్పందిస్తూ.. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. అయితే, భేటీ అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... తమ బాధ చెప్పుకొనేందుకు వెళితే షిండే కేవలం రెండు నిమిషాల సమయమే ఇచ్చారన్నారు. ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. అనూహ్య హత్య ఘటనకు సంబంధించి అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను కలుస్తామని ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బందెల థామస్ నోబుల్, అనూహ్య సోదరుడు దీపక్ ఉన్నారు. వీడని చిక్కుముడులు... అనూహ్య వద్ద రెండు ఫోన్లు ఉండగా ఒకటే లభించింది. కానీ, దొరికింది ఏ ఫోన్ అనేది పోలీసులు వెల్లడించడం లేదు. ఆమె వద్ద ఉండే ల్యాప్‌ట్యాప్, లగేజీ వివరాలు ఇంకా తెలియలేదు. సామ్సంగ్ గెలాక్సీ ఫోన్‌తోపాటు లాప్టాప్లో నిందితులకు సంబంధించిన వివరాలు ఉండే అవకాశముందని, అవి దొరికితే వారినిగుర్తించేందుకు ఆస్కారముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్య హత్య కేసుకు సంబంధించి కొన్ని పత్రికల్లో తొమ్మిదో తేదీన సెల్‌ఫోన్‌ను ఎవరో ఆన్ చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. వెంటనే చర్యలు చేపట్టండి: షిండే అనూహ్య దారుణ హత్య ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని.. నిందితులను వెంటనే పట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అనూహ్య హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి నన్ను కలిసి వేడుకున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపడతారని, ఆ దారుణానికి ఒడిగట్టినవారిని అరెస్టు చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అందులో షిండే పేర్కొన్నారు. -
న్యాయం చేయండి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసులో ఆమె కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని మచిలీపట్నంలోని పలు కళాశాలల విద్యార్థినులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. విజయవాడలోనూ విద్యార్థినులు ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సాఫ్ట్వేర్ ఇంజినీరు ఎస్తేరు అనూహ్య హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద పలు కళాశాలల మహిళా విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ముంబై పోలీసుల డౌన్.. డౌన్... అనూహ్య కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. 15 రోజులు గడుస్తున్నా దోషులను పట్టుకోవడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అనూహ్య ఆచూకీ కోసం ఆమె తండ్రి ప్రసాద్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అనూహ్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనూహ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. మహిళలు పనిచేస్తున్న ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి భద్రత కల్పించాలన్నారు. ధర్నాలో పట్టణంలోని ఆర్కే, లేడియాంప్తిల్, హిందూ కళాశాలల విద్యార్థినులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనూహ్య హత్యకు నిరసనగా విజయవాడలో స్టెల్లా కాలేజీ విద్యార్థులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి అనూహ్య కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.