సాక్షి, ముంబై : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం, హత్య కేసులో బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన చంద్రబాన్‌కు కింది కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. సాయం చేస్తానని నమ్మించి, అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షే సరైందని కోర్టు అభిప్రాయపడింది.
కాగా నాలుగేళ్ల క్రితం మచిలీపట్నానికి చెందిన టెకీ ఎస్తర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు స్వస్థలానికి వచ్చిన అనూహ్య జనవరి 4, 2014న ముంబైకి తిరుగు ప్రయాణమైంది. అయితే మరుసటి రోజు ఉదయం వరకు ఆమె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనూహ్య అదృశ్యంపై విచారణ చేపట్టిన పోలీసులకు జనవరి 16న ముంబై- థాణే ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కుంజూరుమార్గ్ ప్రాంతంలో పొదల్లో ఆమె మృతదేహం లభించింది.
ఈ నేపథ్యంలో ముంబై రైల్వేస్టేషన్‌లో అనూహ్య రైలు దిగినప్పటి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు రైల్వే దొంగ చంద్రబాన్‌ను హంతకుడిగా నిర్ధారించి... మే 26న 542 పేజీలున్న చార్జీషీటును దాఖలు చేశారు. 76 మంది సాక్షులను విచారించి సంబంధిత ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అక్టోబరు 27, 2015 కోర్టు చంద్రబాన్‌ను దోషిగా నిర్థారించిన న్యాయస్థానం... అక్టోబరు 30న అతడికి మరణశిక్ష విధించింది. (అనూహ్య హత్య కేసు : అసలేం జరిగింది.. నిందితుడెలా పట్టుబడ్డాడు)
సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే
కృష్ణా : తన కుమార్తె హత్య కేసులో ముంబై ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని టెకీ అనూహ్య తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నిందితుడు చంద్రబాన్‌కు ఉరిశిక్షే సరైందని, ఆడపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించే వారికి ఈ శిక్ష గుణపాఠం కావాలని ఆకాంక్షించారు. తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఇప్పుడు తనకు సంతృప్తిగా వుందని తెలిపారు. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇదే శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment